అమరావతి : పవన్ ఢిల్లీలో సాధించింది ఇదేనా ?

Vijaya



జనసేన అధినేత ఢిల్లీకి వెళ్ళటం ఇదే మొదలు కాదు ఇదే చివరా కాదు. గతంలో బీజేపీ పెద్దలను కలిసేందుకు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళారు. మరిపుడు వెళ్ళి సాధించింది ఏమిటి ? ఢిల్లీ టూర్లో పవన్ ఏమి చర్చలు జరిపారన్నది రహస్యంగా ఉండిపోయింది. కాకపోతే అందరికీ కనిపించింది మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవటమే. అంటే ఈసారి ఢిల్లీ టూర్లో సాధించింది ఏమిటంటే అమిత్ షా అపాయిట్మెంట్ అనే చెప్పాలి.



గతంలో ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా నరేంద్రమోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ దొరికింది లేదు. అతికష్టంమీద జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై తిరిగొచ్చేసేవారు. కానీ ఈసారి మాత్రం నడ్డానే కాకుండా అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. 25 నిముషాల భేటీలో రాష్ట్రాభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నట్లు పవన్ ట్వీట్లో చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడేందుకు పవన్ కు అంత సీన్ లేదు.



అమిత్ షా  ను కలిసినపుడు రెండుపాయింట్లు కచ్చితంగా మాట్లాడుంటారు. అదేమిటంటే మొదటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయటం. ఇక రెండోది టీడీపీతో పొత్తుగురించి మాట్లాడటం. ఇవిరెండు మినహా హోంశాఖ మంత్రితో పవన్ మాట్లాడటానికి ఏమీలేదు. రాష్ట్రాభివృద్ధి గురించి, అభివృద్ధి ప్రణాళికల గురించి మాట్లాడితే జగన్ మాట్లాడాలి కానీ పవన్ ఏమి మాట్లాడుతారు ? పవన్ మాట్లాడితే ఏమిటి ఉపయోగం ?



రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకునే విషయమై అమిత్ తో పవన్ మాట్లాడుంటారు. ఎందుకంటే చాలాకాలంగా చంద్రబాబునాయుడు తరపున బీజేపీ పెద్దలతో రాయబారం నెరుపుతున్నది పవనే. ఇపుడు కూడా పవన్ ఇంత పట్టుదలగా ఉన్నారంటే టీడీపీ లేకుండా బీజేపీతో మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్ళటం పవన్ కు ఇష్టంలేదు కాబట్టి. ఇదే సమయంలో బీజేపీని వదిలేసి టీడీపీతో చేతులు కలిపేంత ధైర్యం చేయలేకపోతున్నారు కాబట్టి. రిజల్టు ఏమిటనేది ఇఫ్పుడే తెలీదు కానీ ఢిల్లీలో పవన్ హోంశాఖ మంత్రి అపాయిట్మెంట్ సాధించటమే పెద్ద విజయని అనుకోవాలంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: