హైదరాబాద్ : బీజేపీ ఇరకాటంలో పడిందా

Vijaya


ఎన్నికలు వస్తున్న సమయంలో తెలంగాణా బీజేపీ ఇరుకునపడిపోయింది. ఇతర పార్టీల నుండి నేతలు ఎవరు చేరకపోగా ఉన్న నేతలను కాపాడుకోవటమే పెద్ద సమస్యగా మారిపోయింది. పార్టీలో నుండి తొందరలోనే బయటకు వెళ్ళిపోతారని కొందరు ప్రముఖుల పేర్లు బాగా ప్రచారం అవుతోంది. దీంతో లోకల్ నేతల్లోనే కాకుండా అగ్రనేతల్లో కూడా టెన్షన్ మొదలైనట్లుంది.



బీజేపీని తొందరలోనే వదిలేస్తారని ప్రచారం జరుగుతున్న నేతల పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులున్నారు. వీళ్ళంతా ఎందుకని బీజేపీని వదిలేయాలని అనుకుంటున్నట్లు ? ఎందుకంటే పార్టీలో ఊపుకనబడటంలేదు. ఈమధ్య వరకు పార్టీలో కాస్త ఊపుండేది. ఎప్పుడైతే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందో అప్పటినుండే పరిణామాలు మారిపోతున్నాయి.



కాంగ్రెస్ పార్టీ షేర్ మార్కెట్లో ధరలు పెరిగినట్లు ఒక్కసారిగా జోష్ పెరిగిపోయింది. మార్కెట్లో ధరలు పడిపోయిన షేర్లలాగ బీజేపీలో ఉత్సాహం పడిపోయింది. దానికితోడు నేతల మధ్య అంతర్గత వివాదాలు బాగా పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ లో కూడా అంతర్గత వివాదాలకు కొదవేమీలేదు. కాకపోతే రాబోయే ఎన్నికల్లో గెలుపుతమదే అనే భావన, ఉత్సాహం నేతల్లో బాగా కనబడుతోంది. దీనివల్లే బీజేపీలోని ప్రముఖ నేతలు కూడా కాంగ్రెస్ లోకి వచ్చేయబోతున్నట్లు ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈ కారణంగానే కోమటిరెడ్డి, ఈటలను అగ్రనేతలు ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు.



అయితే ఇద్దరు నేతలు కూడా ఢిల్లీ భేటీగురించి ఏమీ మాట్లాడటంలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో గట్టు తగాదాలున్నాయి. అవి తీరేవికాదు. ఎందుకంటే నరేంద్రమోడీ గుడ్ లుక్స్ లో బండి ఉన్నారు. కాబట్టి బండిని ఎవరు ఏమీచేయలేరు. అందుకనే వీళ్ళిద్దరు తొందరలోనే పార్టీ నుండి బయటకు వచ్చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ఢిల్లీ భేటీలో ఏమి జరిగిందో ఏమోకానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చినపుడు మళ్ళీ వీళ్ళతో విడిగా మాట్లాడారు. మరి దీని పరిణామాలు ఏమిటనేది రెండు మూడు రోజుల తర్వాత బయటపడేట్లుంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: