అమరావతి : ఎంఎల్ఏలపై కత్తి వేలాడుతోందా ?
తాడేపల్లిలో జరిగిన వర్క్ షాపులో జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలతో ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పేశారు. ఎంఎల్ఏల గ్రాఫ్ బాగుంటేనే టికెట్లిస్తానని చాలాకాలంగా చెబుతునే ఉన్నారు. అదే విషయాన్ని తాజాగా జరిగిన వర్క్ షాపులో కూడా చెప్పారు. కాకపోతే ఓవరాల్ గా 18 మంది ఎంఎల్ఏల పనితీరు ఏమీ బాగాలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. వచ్చే అక్టోబర్ నాటికి కూడా ఎంఎల్ఏలందరు తమ పనితీరును మెరుగుపరుచుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు.
ఎంఎల్ఏల పనితీరుపై జగన్ రకరకాల మార్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు, ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం ద్వారా మాత్రమే ఎంఎల్ఏలు తమ గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. జగన్ వార్నింగుల కారణంగా కొందరు తమ పనితీరును మెరుగుపరుచుకుంటే మరికొందరు పెద్దగా పట్టించుకోవటంలేదు. తాజాగా జగన్ చెప్పిన వివరాల ప్రకారం 18 మంది అసలు కార్యక్రమాన్ని పట్టించుకోలేదట.
అంటే జగన్ లెక్కలో సదరు 18 మంది ఎంఎల్ఏలకు టికెట్లు దక్కేది కష్టమనే అనుకోవాలి. పనితీరు బాగాలేని వాళ్ళు, విపరీతమైన అవినీతి ఆరోపణలున్న వారి విషయంలో జగన్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. వీళ్ళ పనితీరును అంచనా వేయటానికి ఒకవైపు ఐప్యాక్ బృందాలు, మరోవైపు సచివాలయం వాలంటీర్లు, ఇంకోవైపు గృహసారధులు, చివరకు ఇంటెలిజెన్స్ వర్గాలు గ్రౌండ్ లెవల్లోనే తిరుగుతున్నాయి.
ఇన్నిరకాలుగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు కాబట్టే వచ్చే ఫీడ్ బ్యాక్ దాదాపు యాక్యురేట్ గానే ఉంటుందని అనుకుంటున్నారు. ఇపుడు జగన్ చెప్పిన 18 మంది ఎంఎల్ఏల్లో తిరుగుబాటు చేసిన నలుగురు ఎంఎల్ఏలు ఆనం రామనారాయరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా ఉన్నారా ? లేకపోతే వీళ్ళు కాకుండా మరో 18 మందా అన్న విషయంలో క్లారిటిలేదు. కాకపోతే పై నలుగురు ఎంఎల్ఏలను జగన్ ఎప్పుడో వదిలేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కాబట్టి వీళ్ళు కాకుండానే 18 మంది అని అనుకోవాలి.