అమరావతి : గెలుపుకోసం జగన్ కొత్త వ్యూహం
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మధ్య తరగతి, ఉద్యోగ వార్గాలను ఆకర్షించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లున్నారు. నాలుగేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి పూర్తిగా సంక్షేమపథకాల అమలుపైనే మ్యాగ్జిమమ్ దృష్టిపెట్టారు. సంక్షేమపథకాలను అందుకుంటున్న లబ్దిదారులు తమకు ఓట్లస్తే చాలన్నట్లుగా జగన్ వ్యవహరించేవారు. అయితే ఇపుడు రూటు మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. సమాజంలో పేదలు మాత్రమే కాదని, మధ్య, ఎగువమధ్య తరగతితో పాటు ధనికవర్గాలు కూడా ఉంటాయని ఇంతకాలానికి జగన్ కు గుర్తుకొచ్చినట్లుంది.
ధనిక వర్గాలను వదిలేస్తే ఎగువ, మద్య తరగతి వర్గాల ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళల్లో ప్రధానంగా ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు ఇంకా ప్రధానమైనవి. ఉద్యోగులు సుమారు 5 లక్షలుంటారు. అలాగే పెన్షనర్లు కూడా మరో 5 లక్షలుంటారని అంచనా. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 10 లక్షలంటే ఓట్లరూపంలో చూస్తే కుటుంబాలతో కలిపి సుమారు 40 లక్షలన్నమాట. అందుకనే వీళ్ళని ఆకర్షించేందుకు 12వ పీఆర్సీని నియమించారు. డీఏని పెంచటమే కాకుండా 11వ పీఆర్సీ తాలూకు అరియర్స్ ను నాలుగు విడతల్లో ఇవ్వటానికి ఉద్యోగసంఘాల నేతలతో ఒప్పందం చేసుకున్నది.
ఇది కాకుండా 10 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయాలని కూడా డిసైడ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏని 12 నుండి 16 శాతానికి పెంచారు. ఇక పెన్షన్ విషయానికి వచ్చేసరికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు బదులు గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ను అమల్లోకి తేవాలని డిసైడ్ అయ్యారు.
క్యాబినెట్లో కూడా ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదంతా చూసిన తర్వాత ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకతను పొగొట్టేందుకు తనవంతుగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లే ఉంది. ఈమధ్యనే జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటమి కూడా జగన్ను ఆలోచనలో పడేసుంటుంది. అందుకనే అప్పటినుండి మధ్య, ఎగువ ముఖ్యంగా ఉద్యోగవర్గాలను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే. అన్నీవర్గాలు తమకు ఓట్లేస్తేనే మళ్ళీ విజయం సాధ్యమన్న విషయాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహించారు.