అమరావతి : వారాహి ముహూర్తం నిజమేనా ?

Vijaya



ఎంతోముచ్చటపడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేయించుకున్న వారాహి రోడ్లమీదకు వచ్చే ముహూర్తం ఫిక్సయ్యిందా ? దీనికి సంబంధించి రోడ్డుమ్యాప్ తయారుచేయటానికి రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ముఖ్యనేతలతో సమావేశమయ్యారు కాబట్టి వారాహి యాత్ర ఉభయగోదావరి జిల్లాల్లోనే మొదలవ్వబోతోంది. జూన్ 14వ తేదీన అన్నవరంలో పూజల తర్వాత మొదలయ్య మొదటివిడత యాత్ర అమలాపురం వరకు సాగుతుంది.  



అయితే ఇలాంటి ముహూర్తాలు గతంలో కూడా చాలానే డిసైడ్ చేశారు. వారాహి ముహూర్తం ఇలా డిసైడ్ చేయటం అలా వాయిదాలు పడటం జనాలందరికీ మామూలైపోయింది. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు దేవాలయంలో భారీఎత్తున పవన్ పూజలు చేయించిన విషయం తెలిసిందే.



పూజలు చేయించిన రోజునే అభిమానుల సమావేశంలో మాట్లాడుతు తొందరలోనే తెలంగాణాలో వారాహి యాత్ర మొదలవుతుందన్నారు. కానీ అప్పటినుండి మళ్ళీ వారాహి రోడ్డెకితే ఒట్టు. తర్వాత చాలాకాలానికి మంగళగిరి పార్టీ ఆఫీసు నుండి ట్రైల్ రన్ పద్దతిలో మచిలీపట్నం బహిరంగసభకు వారాహి వెహికల్ లోనే పవన్ ప్రయాణించారు. ఇది జరిగి కూడా చాలాకాలమైపోయింది. మచిలీపట్నం బహిరంగసభ తర్వాత వారాహి షెడ్లోనే ఉండిపోయింది. మళ్ళీ ఇంతకాలానికి వారాహి యాత్రపై నాదెండ్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.



ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గాన్ని యాత్రలో పవన్ టచ్ చేసేట్లుగా రూటుమ్యాప్ రెడీ చేయాలన్నది నాదెండ్ల ప్లాన్. మొదటినుండి కూడా జనసేన పార్టీ బలమంతా ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. పవన్ కాపు కాబట్టి, కాపులు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి పార్టీ ప్రభావం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిది ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే. అందుకనే వారాహి యాత్రను ఉభయగోదావరి జిల్లాల్లోనే ప్రారంభిస్తే కాపులను ఎక్కువగా ఆకట్టుకోవచ్చనే వ్యూహం కూడా దాగుందేమో తెలీదు. మొత్తానికి వారాహి జూన్ 14వ తేదీన రోడ్లపైకి వస్తుందని ప్రకటించారు. మరి ఆరోజు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: