ఢిల్లీ : ‘నిన్ హైడ్రేట్’ వల్ల ఏమన్నా లాభముందా ?
వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఒక లేఖపై నిన్ హైడ్రేట్ పరీక్ష చేయించాలని సీబీఐ అనుకున్నది. ఇందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటీషన్ వేసింది. అయితే ఈ పరీక్ష జరిపే విషయంలో నిందితుల స్పందన కూడా కోరాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం చెప్పి జూన్ 2వ తేదీకి విచారణను వాయిదావేసింది. అంతా బాగానే ఉంది కానీ హత్య జరిగిన ఇంతకాలానికి వివేకా రాసిన లేఖ మీదున్న వేలిముద్రలను ఎందుకు పరిశీలించాలని అనుకుంటున్నదో అర్ధం కావటంలేదు.
ఎందుకంటే వివేకా హత్య జరిగింది 2019 ఫిబ్రవరిలో. అప్పట్లోనే ఆ లేఖను వివేకా పీఏ క్రిష్ణారెడ్డి దాచిపెట్టేశారు. ఆ విషయాన్ని పీఏ కూడా అంగీకరించారు. తాను దాచిపెట్టిన లేఖను వివేకా కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఇచ్చినట్లు చెప్పారు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి దగ్గర నుండి ఆయన సోదరుడు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ లేఖను ఎంతమంది చూశారో ఎవరికీ తెలీదు. అంటే పీఏ చెప్పిన దానిప్రకారమే లేఖపైన పీఏ వేలిముద్రలతో పాటు సునీత దంపతులు, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి వేలిముద్రలు ఉండే అవకాశముంది.
అలాగే లేఖను చూసిన ప్రతి ఒక్కళ్ళ వేలిముద్ర కూడా ఉంటుంది. కాకపోతే ఒకళ్ళ వేలిముద్రలపైన మరొకళ్ళ వేలిముద్రలు కలిసిపోయే అవకాశం ఉంది. సీబీఐ కోరుకుంటున్న నిన్ హైడ్రేట్ పరీక్షల ద్వారా ఏమి తేలుతుందో తెలీదు. ఒక్కళ్ళిద్దరి వేలిముద్రలుంటే అవి ఎవరివో తేలుతుంది. అలాకాకుండా పదిమంది వేలిముద్రలు ఒకదానిపైన మరొకటి పడిపోతే ఏ వేలిముద్రకు దాన్నే నిన్ హైడ్రేట్ పరీక్ష విడదీసి ఎవరి వేలిముద్రలు ఎవరివో పరీక్షలో తెలుసుకునే అవకాశముందా ? అన్నదే సందేహం.
అలా తేలే అవకాశం లేదంటే ఇపుడు నిన్ హైడ్రేట్ పరీక్ష జరపటంలో సీబీఐ వ్యూహం ఏమిటన్నది అంతుబట్టడంలేదు. ఒకవేళ అవకాశం ఉంటే లేఖను ఎంతమంది చదవిరో తెలుస్తుంది కానీ హత్యతో వాళ్ళకు సంబంధం ఉందనేందుకు లేదు. ఇప్పటికే సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)లో లేఖను పరిశీలనకు ఇచ్చారు. ఆ లేఖను వివేకానందరెడ్డే తీవ్ర ఒత్తిడిలో రాశారని తేల్చింది. ఇపుడు నిన్ హైడ్రేట్ పరీక్ష ద్వారా కొత్తగా ఏమి తేలుతుందో చూడాలి.