అమరావతి : కుమారస్వామే పవన్ కు ఆదర్శమా ?
మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. అదేమిటంటే 2019 ఎన్నికల్లో జనసేన తరపున కొందరు ఎంఎల్ఏలు గెలవలేకపోవటానికి జనాలే కారణమట. ఎలాగంటే అప్పటి ఎన్నికల్లో జనసేన 137 నియోజకవర్గాల్లో పోటీచేస్తే ఒక్క సీటులో మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. కనీసం 30 లేదా 40 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు గెలుస్తారని పవన్ అంచనా వేసినట్లున్నారు. అయితే అంచనాకు, వాస్తవానికి చాలా తేడాలుంటాయని పవన్ కు బహుశా తెలీదేమో.
అందుకనే జనాలు జనసేన పార్టీ అభ్యర్ధులను ఎందుకు గెలిపించలేదని అడిగారు. జనాలు కనీసం 40 సీట్లలో జనసేన అభ్యర్ధులను గెలిపించుంటే పరిస్దితులు ఇపుడు వేరే విధంగా ఉండేవన్నారు. కర్నాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి పాత్రలాంటిది ఏపీలో తాను పోషించుండే వాడినని పవన్ చెప్పారు. తమ అభ్యర్ధులను గెలిపించకుండా సమస్యలను పరిష్కరించమని జనాలు అడిగితే తానేం చేయగలనని ఎదురు ప్రశ్నించారు.
ఒకపుడు చంద్రబాబునాయుడు కూడా ఇలాగే మాట్లాడేవారు. టీడీపీని ఓడించి జనాలు తప్పుచేశారంటు తన అక్కసునంతా చూపించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. పదే పదే ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పారు. అయితే తర్వాత ఏమైందో ఏమో అలా మాట్లాడటం మానుకున్నారు. ఇపుడు పవన్ అలాగే మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పవన్ తనను తాను కుమారస్వామితో పోల్చుకుంటున్నారు. నిజానికి కుమారస్వామికి పవన్ కు ఎలాంటి పోలికలేదు.
ఎందుకంటే జేడీఎస్ అధినేత కుమారస్వామి పూర్తిస్ధాయి పొలిటీషియన్. దశాబ్దాల పాటు పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నిదెబ్బలుతిన్నా పక్కకుపోకుండా రాజకీయాల్లోనే కంటిన్యు అవుతున్నారు. కానీ పవన్ అలాకాకుండా పార్ట్ టైం పొలిటీషయన్ అనే ముద్ర వేయించుకున్నారు. సినిమా షూటింగుల గ్యాప్ లో మాత్రమే పవన్ రాజకీయాలు చేస్తున్నారు. జేడీఎస్ పొత్తులో కాకుండా ఒంటరిగా కూడా పోటీచేసి చాలా దెబ్బలు తిని రాటుతేలింది. ముఖ్యమంత్రి పదవిని అందుకునేందుకు కుమారస్వామి చాలా ఓపిగ్గా వెయిట్ చేశారు. పవన్ అంత ఓపిక లేదని అందరికీ తెలుసు ? చివరకు తన ఫెయిల్యూర్లను పవన్ జనాల ఖాతాలో వేసేశారు.