అమరావతి : ఎంపీకి చంద్రబాబే షాకిచ్చారా ?

Vijaya



ఇపుడీ విషయంపైనే  పార్టీలో బాగా చర్చ జరుగుతోంది. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని పార్టీ దూరంపెట్టినట్లు బాగా టాక్ నడుస్తోంది. కారణం ఏమిటంటే పార్టీలో కార్యక్రమాలకు కానీ లేదా పార్టీ తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా ఎంపీకి పిలుపులు అందటంలేదట. విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి తప్ప ఇంకే నియోజకవర్గం నుండి ఎంపీకి ఎలాంటి ఆహ్వనాలు అందటంలేదని సమాచారం.



ఇంతకీ విషయం ఏమిటంటే చాలాకాలంగా చంద్రబాబునాయుడుతోనే ఎంపీకి పడటంలేదు. ఎంపీ మూడ్ ఏ రోజు ఎలాగుంటుందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. కొద్దిరోజులేమో చంద్రబాబును తీసిపారేసినట్లు మాట్లాడుతారు. పార్టీ సమావేశాల్లోనే కాకుండా మీడియా ముందుకూడా చంద్రబాబు గురించి చాలా చులకనగా మాట్లాడుతారు. కొద్దిరోజులేమో చంద్రబాబును ఆకాశానికెత్తేస్తారు. ఇలాంటి విచిత్రమైన వైఖరి వల్లే ఎంపీ అంటే అందరికీ చికాకుగా ఉంది.



వచ్చేఎన్నికల్లో టీడీపీ తరపున నానీ  పోటీచేస్తారా ? అనేది పెద్ద డౌట్. ఇదే సమయంలో ఎంపీకి చంద్రబాబు టికెట్ ఇస్తారా అనే విషయాన్ని కూడా తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. టికెట్ సంగతిని పక్కనపెట్టేస్తే ఎంపీ సోదరుడు కేశినేని చిన్నీకి మాత్రం చంద్రబాబు బాగా ప్రధాన్యతిస్తున్నారు. ఎంపీకి దూరంగా ఉండమని స్వయంగా చంద్రబాబే తమ్ముళ్ళకి చెప్పారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అందుకనే పార్టీపరంగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులు, అన్న క్యాంటీన్లు, పేదలకు దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రమాల్లో ఎంపీ ఎక్కడా కనబడటంలేదు. అసలు ఎంపీకి ఆహ్వానాలే అందటంలేదట.



ఇదే సమయంలో పార్టీలో ఎలాంటి హోదాలేని చిన్నీకి మాత్రం అందరు ప్రాధాన్యతిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి చిన్నీకి ఆహ్వానాలు అందుతున్నాయి. చిన్నీ కూడా రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకపుడు ఎంపీ ఇంటిదగ్గర కనిపించిన పార్టీలోని చిన్నా చితకా నేతలంతా కొద్దిరోజులుగా చిన్నీ ఇంటిదగ్గర కనిపిస్తున్నారు. సో, జరుగుతున్నది చూస్తుంటే పార్టీ ఎంపీని దూరంగా పెట్టేసినట్లు అర్ధమవుతోంది. ఇదే విషయాన్ని ఎంపీతో ప్రస్తావిస్తే ‘వాళ్ళేంటి నన్ను ఆహ్వానించేంది నా అభిమానులు నాకుంటారు’ అని సమాధానమిచ్చారు.  దీంతోనే విషయం అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: