అమరావతి : రెబల్ ఎంఎల్ఏలు ఇరుక్కోవటం ఖాయమేనా ?

Vijaya



ఎంఎల్సీ ఎన్నికలు కాదు కానీ ఇపుడు రెబల్ ఎంఎల్ఏలకు పెద్ద చిక్కొచ్చిపడింది. రెబల్ ఎంఎల్ఏలు ఇటు వైసీపీలోను అటు టీడీపీలోనూ ఉన్నారు. అయితే టీడీపీలోని రెబల్స్ చంద్రబాబునాయుడును ధిక్కరించి పార్టీతో తమకు సంబంధంలేదని తేల్చేశారు. అధికారికంగా నలుగురు ఎంఎల్ఏలు వైసీపీలో చేరకపోయినా అధికారపార్టీతోనే ప్రయాణిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీలో కూడా ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలు తయారయ్యారు. ఇపుడు సమస్యంతా వీళ్ళకే చుట్టుకుంటోంది.



జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు బాగానే ఉంటారు. మధ్యలో ఇరుక్కునేది వైసీపీ ఎంఎల్ఏలు  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డే.  వీళ్ళద్దరికీ ఎదురవ్వబోయే సమస్య ఏమిటంటే వీళ్ళిద్దరిని నమ్ముకునే చంద్రబాబు బీసీ మహిళా నేత పంచుమర్తితో నామినేషన్ వేయించారు. అసెంబ్లీలోని ఎంఎల్ఏల బలాన్ని బట్టిచూస్తే టీడీపీకి గెలుపు అవకాశమే లేదు.  ఇపుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే టీడీపీ అభ్యర్ధికి ఆనం, కోటంరెడ్డి గనుక ఓట్లేస్తే వైసీపీ  వీళ్ళిద్దరినీ ఊరికే వదిలిపెట్టదు. రెబల్ గా తయారైనా పర్సనల్ గా వీళ్ళజోలికి వెళ్ళకుండా  పార్టీ, ప్రభుత్వపరంగా వీళ్ళని పక్కనపెట్టేశారంతే.



ఇదే సమయంలో చంద్రబాబు అనుకున్నట్లుగా ఆనం, కోటంరెడ్డి ఓట్లు టీడీపీ అభ్యర్ధికి పడకపోతే రేపు పార్టీలోకి ఎంట్రీ ఇబ్బందైపోతుంది. ఓట్లేస్తారని వీళ్ళని నమ్మి అభ్యర్ధిని పెడితే నిలువునా ముంచేశారని తమ్ముళ్ళు వీళ్ళని  గట్టిగా తగులుకుంటారు. పార్టీలోకి రాకుండానే చంద్రబాబుకు నమ్మకద్రోహం చేశారనే గోలమొదలైపోతుంది. అప్పుడు పార్టీలోకి ఎంట్రీ కష్టమైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పటికే వీళ్ళిద్దరినీ పార్టీలోకి చేర్చుకోవద్దని చంద్రబాబుపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది.



తాముటీడీపీ అభ్యర్ధికి ఓట్లేస్తామని రెబల్ ఎంఎల్ఏలు చెప్పలేదు. అలాగని తమ్ముళ్ళూ చెప్పలేదు.  అయితే వీళ్ళిద్దరి ఓట్లు వస్తాయన్న నమ్మకంతోనే పంచుమర్తిని పోటీలోకి దింపారన్నది వాస్తవం. లేకపోతే 22 ఓట్లు కావాల్సిన సమయంలో టీడీపీలోని 19 ఓట్లతో గెలుస్తామని ఎలా అనుకుంటారు ? ముందు రెబల్ ఎంఎల్ఏల ఓట్లు ఖాయమైతే తర్వాత అసంతృప్తిగా ఉన్న ఎవరో ఒకళ్ళ ఓటు లాక్కోవటం పెద్ద కష్టంకాదని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. రెబల్ ఎంఎల్ఏలు టీడీపీకి ఓట్లేస్తే ప్రభుత్వం+వైసీపీలో సమస్య మొదలవుతుంది. వేయకపోతే టీడీపీలో సమస్య.  పంచుమర్తికి పడే ఓట్లతోనే ఎవరు వేశారు ? ఎవరు వేయలేదని  క్లారిటి వచ్చేస్తుంది. చూడాలి ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: