ఉత్తరాంధ్ర : ఎన్నికల ముందు బీజేపీకి కేంద్రమంత్రే షాకిచ్చారా ?
సరిగ్గా ఎంఎల్సీ ఎన్నికల ముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీ బీజేపీకి గట్టి షాకిచ్చారనే చర్చ నడుస్తోంది. రాజధాని వివాదం అధికార, ప్రతిపక్షాల మధ్య ఏ స్ధాయిలో జరుగుతోందో అందరు చూస్తున్నదే. వైసీపీ ఏమో మూడు రాజధానుల కాన్సెప్టును తెరపైకి తెచ్చి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపాటిల్ అని పదే పదే చెబుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలన్నీ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వాదిస్తున్నాయి. చివరకు ఈ అంశం సుప్రింకోర్టుకు చేరింది.
ఈ నేపధ్యంలోనే విశాఖపట్నంలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో జగన్మోహన్ రెడ్డి విశాఖను కాబోయే పరిపాలనా రాజధానిగా బాగా హైలైట్ చేశారు. జగన్ కోణంలో ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీలేదు. అయితే హఠాత్తుగా బీజేపీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రూపంలో పెద్ద చిక్కు వచ్చిపడింది. ఎలాగంటే సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన కేంద్రమంత్రి తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం ఉండాలంటే రాజధాని విశాఖ ప్రాంతంలో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.
ఈనెల 13వ తేదీన జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కిషన్ పై వ్యాఖ్యలు చేశారు. దాంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలేమో అమరావతి మాత్రమే రాజధాని అని చెబుతుంటే కిషన్ ఏమో విశాఖ రాజధాని అని బాంబు పేల్చారు. కిషన్ ప్రకటన కమలనాదులకు మింగుడుపడలేదు. ఇపుడు ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ నేతలు అమరావతినే రాజధానిగా చెబుతున్న సమయంలో కేంద్రమంత్రి విరుద్ధంగా చెప్పటం ఏమిటో వీళ్ళకి అర్ధంకాలేదు.
కిషన్ రెడ్డి ప్రకటన విన్నతర్వాత కమలనాదులంతా అయోమయంలో పడిపోయారు. కేంద్రప్రభుత్వం కూడా విశాఖకే జై కొట్టిందా అన్న అనుమానాలు నేతల్లో పెరిగిపోతోంది. రాజధానిపై కేంద్రమంత్రి ఒకలాగ లోకల్ నేతలు మరోలాగ మాట్లాడటంతో మామూలు జనాల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. కిషన్ రెడ్డి ప్రకటన ప్రభావం జరగబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే.