ఢిల్లీ : తిరుగుబాటు ఎంపీకి ప్రాణహానా ?
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరికను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈసారైనా తిరుస్తారో లేదో తెలీదు. ఇంతకీ రాజుగారి కోరిక ఏమిటంటే తనను వైసీపీ సభ్యునిగా కాకుండా స్వతంత్ర సభ్యునిగా పరిగణించాలని స్పీకర్ కు లేఖరాశారు. అలాగే వైసీపీ సభ్యులతో కలిపి తనకు సీటు కేటాయించకుండా వాళ్ళకి దూరంగా కేటాయించాలని కూడా తన లేఖలో రిక్వెస్టు చేసుకున్నారు. ఎందుకంటే వైసీపీ ఎంపీల నుండి తనకు ప్రాణహాని ఉందని రాజుగారు ఆందోళన వ్యక్తంచేశారు.
సరే పార్లమెంటుకు కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు కదా. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో తనకు సపరేటు సీటు కేటాయించాలని అడిగారు. అలాగే తనను స్వతంత్ర అభ్యర్ధిగా పరిగణించాలని కూడా రిక్వెస్టు చేశారు. నిజానికి ఈ రెండు కోరికలు కూడా పెద్దవేంకాదు. స్పీకర్ తలచుకుంటే ఎంపీ రెండు కోరికలను వెంటనే తీర్చేయగలరు. అయితే ఎంపీ కోరికమీద స్పీకర్ ఏమన్నా ముందు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అభిప్రాయం కోరుతారేమో చూడాలి.
చాలాకాలం క్రితమే జగన్ మీద యాక్షన్ తీసుకోవాలని ఎంపీ స్పీకర్ కు ఫిర్యాదుచేశారు. ఎంపీని అయిన తనను పోలీసులతో జగన్ కొట్టించారు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ కింద జగన్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ కోరికను స్పీకర్ పట్టించుకోలేదు. సభలో జరిగే వ్యవహారాలను మాత్రమే తాను పట్టించుకుంటానని సభ వెలుపల జరిగే వ్యవహారాలతో సంబంధంలేదు పొమ్మన్నారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక మౌనంగా ఉండిపోయారు.