అమరావతి : జగన్లో కాపుల టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya






రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రప్రభుత్వం తాజా ప్రకటన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్ధితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అగ్రవర్ణాల్లో పేదలకు (ఈ డ్బ్ల్యూస్) 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సింది రాష్ట్రప్రభుత్వాలే అని కేంద్రం తాజాగా చేసిన ప్రకటన కచ్చితంగా జగన్ పై ఒత్తిడి పెంచేస్తుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే ఈ 10 శాతం రిజర్వేషన్లలోనే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కేటాయించారు.





కాపులకు రిజర్వేషన్ అయితే కేటాయించారు కానీ అమల్లోకి తేలేదు. ఎన్నికలు, టీడీపీ ఘోరఓటమి, జగన్ అఖండ మెజారిటితో అధికారంలోకి రావటం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన జగన్ అంతకుముందు చంద్రబాబు నిర్ణయాన్ని పక్కనపడేశారు. అప్పటినుండి కాపులకు 5 శాతం రిజర్వేషన్ డిమాండుగానే మిగిలిపోయింది. అప్పట్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయమే తప్పుడు నిర్ణయం.





కేంద్రం అగ్రవర్ణాల్లోని  పేదలందరికీ కలిపి 10 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే చంద్రబాబు కాపులకు మాత్రమే 5 శాతం కేటాయించటం తప్పే. జగన్ ఉద్దేశ్యం ఏమిటంటే అగ్రవర్ణాల్లోని పేదల జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాలని. అయితే జగన్ ఆలోచన అమల్లోకి రావటం అంత సులభంకాదు. జనాభా లెక్కలు తీయందే ఎవరి జనాభా ఎంతో తేలదు. అందుకనే జగన్ ఆలోచన కూడా అమల్లోకి రాకుండా కాపులకు రిజర్వేషన్ అలా మూలపడిపోయింది.





ఇపుడు ఎన్నికలకు ముందు కేంద్రం చేసిన ప్రకటన కారణంగా జగన్ పై కాపులు ఒత్తిడి పెంచేయబోతున్నారు. ఈ నెల 26వ తేదీన విశాఖలో జరగబోయే కాపునాడు బహిరంగసభలో ఈ విషయమే కీలకం కాబోతోంది. తమకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చితీరాలని కాపులు డిమాండ్ చేయబోతున్నారు. ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే మరోసమస్య.  జగన్ నిర్ణయంపైనే కాపుల మద్దతు ఆధారపడుందన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి జగన్ ఏమి చేయబోతున్నారు అన్నది ఇపుడు అందరిలోను ప్రత్యేకించి కాపు నేతల్లో ఆసక్తిని పెంచేస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: