అమరావతి : ఇద్దరు డబుల్ గేమ్ ఆడుతున్నారా ?

Vijaya





మామూలుగా ఈ విషయమై ఎవరికీ అనుమానం రాదు. కానీ తాజాగా రేణిగుంటలో తనను కలసిన మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత అనుమానించాల్సిన అవసరం వచ్చింది. జనసేన పార్టీలో అధినేత పవన్ కల్యాణ్ తర్వాత స్ధానం నాదెండ్లదే అనటంలో సందేహంలేదు. ఇద్దరు ఒకళ్ళపై మరొకళ్ళు పూర్తిగా ఆధారపడున్నారు. కాబట్టి వీళ్ళ సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి.



అయితే ఇటు పవన్ అటు నాదెండ్ల డైలాగులు విన్న తర్వాత ఎవరికైనా వీళ్ళిద్దరికీ చెడిందా అనే అనుమానాలు రాకమానవు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటం కోసం ఎవరితో అయినా కలుస్తానని పవన్ చెప్పింది నిజమే. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం చంద్రబాబునాయుడుతో కలిసి పోరాటాలు చేస్తానని ప్రకటించింది కూడా వాస్తవమే. అయితే అదంతా నరేంద్రమోడీ వైజాగ్ పర్యటనకు ముందు మాట. మోడీతో భేటీ తర్వాత సీన్ మారిపోయింది.



ఇపుడు ఎక్కడ పర్యటించినా వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని మాత్రమే పవన్ జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన అన్నీ సీట్లకు పోటీచేస్తుందనే అర్ధంవచ్చేట్లుగా మాట్లాడుతున్నారు. ఇటు మిత్రపక్షం బీజేపీ విషయాన్ని కానీ అటు టీడీపీ ప్రస్తావన కానీ పవన్ తేవటంలేదు. సరిగ్గా  ఇలాంటి సమయంలోనే నాదెండ్ల మాట్లాడుతు ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో అందరినీ కలుపుకుని వెళతామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అన్నీ పార్టీలతో మాట్లాడుతామని చెప్పారు. నాదెండ్ల మాటలకు అర్ధమేమిటంటే కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పటమే.




పవన్ ఏమో జనసేనది ఒంటరిపోటీ అన్నట్లుగా మాట్లాడుతుంటే  నాదెండ్లేమో పొత్తులు పెట్టుకుంటామన్నట్లుగా మాట్లాడారు. ఇద్దరి మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మరిప్పుడు జనాలు  ఎవరు చెప్పేది నమ్మాలి ? పార్టీ అధినేత పవనే కానీ నాదెండ్ల కాదు. కాబట్టి పొత్తులైనా, ఒంటరిపోటీ అయినా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది పవనే కానీ నాదెండ్లకాదు. ఇక్కడే ఇద్దరు కలిసి డబల్ గేమ్ ఆడుతున్నారా ? లేకపోతే పవన్-నాదెండ్లకు చెడిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: