అమరావతి : వీళ్ళ కోసం జగన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారా ?

Vijaya




వచ్చేఎన్నికల్లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ను ఎదుర్కొనేందుకు వైసీపీ రెండు బ్రహ్మాండమైన అస్త్రాలను సిద్దంచేసింది. ఇంతకీ ఆ అస్త్రాలు ఏమిటంటే టీడీపీ హయాంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసిచటం, తుని రైలు దహనం కేసులో కాపులపైన పెట్టిన వేదింపుల కేసులు. చంద్రబాబు, పవన్ను కాపులకు దూరంచేయాలంటే ఈ రెండు అంశాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్ళాలని వైసీపీ డిసైడ్ అయ్యింది.





పవన్ కు వ్యతిరేకంగా వైసీపీలోని మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం ముఖ్యఉద్దేశ్యం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పవన్ కు కాపు సామాజికవర్గాన్ని దూరంచేయటమే. వచ్చేఎన్నికల్లో జనసేన బలంపెరుగుతుందని, ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో ఓట్లు, సీట్లు వస్తాయని పవన్ అంచనా వేసుకుంటున్నారు. సో ఈ నేపధ్యంలోనే ఉభయగోదావరి జిల్లాల్లోనే జనసేనను దెబ్బకొట్టేందుకు వైసీపీకి కూడా వ్యూహాలను రెడీచేస్తోంది.





కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినతర్వాత పట్టించుకోకపోవటంతో కాపునేత ముద్రగడపద్మనాభం ఆందోళనలు మొదలుపెట్టారు. ఆందోళనలను అణిచేసేందుకు చంద్రబాబు ముద్రగడ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ముద్రగడ కుటుంబం విషయంలో అప్పట్లో పోలీసులు చాలా అనుచితంగా వ్యవహరించారు. ఇంట్లో ఉన్న ముద్రగడతో పాటు, కొడుకులు, ఆడవాళ్ళని కూడా కొట్టుకుంటు, రోడ్లపైన ఈడ్చుకుంటు వెళ్ళి పోలీసుస్టేషన్లో పెట్టారు.





ఆ ఘటనలన్నీ అప్పట్లో సంచలనమయ్యాయి. ముద్రగడ కుటుంబం విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలు యూట్యూబు, సోషల్ మీడియాలో చూడచ్చు. ఇక రెండో అస్త్రం ఏమిటంటే రిజర్వేషన్ల సాధనకోసమే ముద్రగడ తునిలో బహిరంగసభ పెట్టారు. ఆ సందర్భంగా రత్నాచల్ రైలుకు కొందరు నిప్పుపెట్టారు.





రైలు దహనం ఘటనలో దాదాపు  200 మంది కాపునేతలు, యువతపై కేసులుపెట్టి జైళ్ళకు పంపారు. ఘటనతో తమకేమీ సంబంధంలేదని వాళ్ళంతా మొత్తుకుంటున్నారు. ఆ కేసు ఇంతవరకు తేలలేదు కానీ కేసుల్లో ఇరుక్కున్న వారంతా ఇంకా కోర్టులచుట్టూ తిరుగుతునే ఉన్నారు. అప్పట్లో ఈ విషయమై పవన్ ఒక్కసారి కూడా కాపులకు మద్దతుగా మాట్లాడలేదు. పై రెండు ఘటనలనే రాబోయే రోజుల్లో చంద్రబాబు, పవన్ కు వ్యతిరేకంగా ప్రధాన అస్త్రాలుగా ప్రయోగించాలని వైసీపీ డిసైడ్ చేసింది. మరి ఆ అస్త్రాలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: