అమరావతి : పవన్ పై జనసైనికులే ఒత్తిడి పెంచేస్తున్నారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జనసేన నేతలు, సైనికులే ఒత్తిడి పెంచేస్తున్నారట. ఇంతకీ వీళ్ళు ఒత్తిడి పెంచుతున్నది ఏ విషయంలో అంటే టీడీపీ పొత్తు విషయంలోనే అట. మొదటిపాయింట్ అసలు పొత్తే వద్దని. తప్పనిస్ధితిలో పొత్తు పెట్టుకోవాలంటే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించాలట. నిజానికి రెండుపార్టీలు పొత్తుపెట్టుకోవటాన్ని పార్టీల్లోని చాలామంది నేతలు అంటే అశావహులు వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏమిటంటే రెండుపార్టీల్లోని నేతల్లోను కలవరం ఒకటే.
ఎన్నికల్లో తమకు టికెట్లు ఎక్కడ చేజారిపోతుందో అని. పొత్తు కారణంగా కచ్చితంగా రెండుపార్టీల్లోను కొందరు అశావహులకు నిరాసతప్పదు. అందుకనే ఎన్నికలకు ముందు పొత్తుపెట్టుకునేకన్నా తర్వాత పొత్తుపెట్టుకుంటే బాగుంటుందని రెండువైపుల నేతలు తమ అధినేతలకు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యపరిరక్షణ పేరుతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ చేతులు కలిపారు. తర్వాత ఎన్నికలో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించటమే మిగిలుందని అందరు అనుమానిస్తున్నారు.
ఈ అనుమానంతోనే రెండుపార్టీల్లోని నేతలు అధినేతల కలయికను వ్యతిరేకిస్తున్నారు. అయితే పొత్తులేకుండా వేర్వేరుగా పోటీచేస్తే ఏమి జరుగుతుందో చంద్రబాబు, పవన్ కు బాగా తెలుసు. అందుకనే వేర్వేరుగా పోటీచేసేందుకు ధైర్యం చేయటంలేదు. ఈ నేపధ్యంలోనే జనసేనలోని నేతలు, కార్యకర్తలు మాత్రం పవన్ పై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారట. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ను ప్రకటిస్తేనే పొత్తు పెట్టుకోవాలని లేకపోతే నష్టం తప్పదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారట. పార్టీ అభిమానులు, ఫ్యాన్స్ సభ్యులంతా పవన్ పై ఈ విషయంలోనే బాగా ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
అయితే వీళ్ళ డిమాండ్ నెరవేరే అవకాశాలు లేవనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కాకపోతే ఏమి జరుగుతుందో అందరికన్నా చంద్రబాబుకే ఎక్కువతెలుసు. కాబట్టి సీఎంగా తాను తప్ప ఇంకెవరినీ చంద్రబాబు ప్రకటించే అవకాశామే లేదు. చంద్రబాబు తో పొత్తుపెట్టుకోవాలంటే తనని సీఎంగా ప్రకటించాలనే కండీషన్ పెట్టమని పవన్ని బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించి కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నమ్మదగ్గదిగా లేదు. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.