గోదావరి : పవన్ పోటీచేసే నియోజకవర్గం ఖాయమైనట్లేనా ?
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం ఏది ? ఇపుడీ విషయంపైనే పార్టీలో నేతలతో పాటు అభిమానుల్లో కూడా చర్చ జరుగుతోంది. తిరుపతిలో పోటీచేయమని అక్కడి నేతలు ఆఫర్ చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో చేయమని అక్కడినేతలు ఒత్తిడి పెడుతున్నారు. భీమిలీ అని లేదు లేదు గాజువాక, భీమవరంలోనే పోటీచేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే పవన్ ఆలోచనంతా పిఠాపురం నియోజకవర్గం మీదే ఉందని తాజా సమాచారం.
ఈ నియోజకవర్గం మీదే పవన్ ఎందుకు ఆసక్తిచూపుతున్నారంటే ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువ. మామూలుగానే ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు బాగా ఎక్కువ కాబట్టి సహజంగానే ప్రభావం కూడా ఎక్కువే. ఇందులో కూడా పిఠాపురం అంటేనే కాపుల నియోజకవర్గంగా పేరుంది. కాపుల తర్వాత క్షత్రియుల ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎంఎల్ఏలను చూస్తే ఎక్కువమంది కాపులే ఉంటారు.
ఇందుకనే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా పవన్ ఎంచుకున్నారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే దాని ప్రభావం బాగా ఉంటుందని అనుకుంటున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో పోటీచేస్తే గెలుపు ఖాయమని లోకల్ నేతలు చెప్పారట. ఇందులో భాగంగానే పవన్ పోటీచేస్తే ఎలాగుంటుందనే విషయంలో ఇప్పటికే సర్వేలు కూడా జరిగాయట. ఇక వైసీపీ ఎంఎల్ఏ పెండెం దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమంటున్నారు. కాకినాడ ఎంపీ వంగాగీత లేదా ముద్రగడపద్మనాభం రెండోకొడుకు బాలు పోటీచేయచ్చనే ప్రచారం జరుగుతోంది.
వంగాగీత ప్రజారాజ్యంపార్టీ తరపున 2009లో ఎంఎల్ఏగా గెలిచారు. మొదట్లో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా, రాజ్యసభ ఎంపీగా తర్వాత ఎంఎల్ఏగా ఇపుడు మళ్ళీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆమెకు పిఠాపురం నియోజకవర్గంలో మంచి సంబంధాలున్నాయని పార్టీలో టాక్. సో రెండుపార్టీల నుండి అందుతున్న సమాచారం ప్రకారమైతే టీడీపీ, జనసేన పొత్తులో పవన్ పోటీచేస్తారని, వైసీపీ తరపున ఇద్దరిలో గీత పోటీచేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకవచ్చు.