అమరావతి : జేపీ యూ టర్న్ కు కారణమిదేనా ?
లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. ఇంతకాలం ఏపీ రాజధాని నిర్మాణంతో పాటు అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, సంక్షేమపథకాలు తదితర అంశాలపై ఇంతకాలం వినిపించిన వాదనలకు తాజాగా పూర్తి విరుద్ధంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత సమైక్యరాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అప్పట్లో కూకట్ పల్లి ఎంఎల్ఏగా పనిచేసిన జేపీ మాట్లాడుతు కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ రాజధాని అనుభవం పునరావృతం కాకూడదన్నారు.
మొత్తం అభివృద్దినంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదంటు చాలానే మాట్లాడారు. అప్పటి అసెంబ్లీ సమావేశాల్లో జేపీ మాట్లాడిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామాలను వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మూడురాజధానుల ప్రతిపాదనను జేపీ స్వాగతించారు. హైకోర్టు ఒకచోట, అసెంబ్లీ, సచివాలయం చెరోచోట ఏర్పాటుచేయటం చాలామంది నిర్ణయమన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న కొన్ని సంక్షేమపథకాలు చాలా బాగున్నాయన్నారు. రైతులకు ప్రభుత్వాలు ఎంతచేసినా తక్కువే అని చాలాసార్లు చెప్పారు. సచివాలయ వ్యవస్ధ, డైరెక్టు బెనిఫిట్ ట్రాన్సఫర్ విధానం వల్ల అవినీతి తగ్గిందన్నారు. ప్రతిపక్షాల వాదనను జేపీ ఎన్నోసార్లు తప్పుపట్టారు కూడా. ఇదే సమయంలో ప్రభుత్వంలోని లోపాలను కూడా జేపీ రెగ్యులర్ గా ప్రస్తావిస్తునే ఉన్నారు.
సమాజంలో మేథావిగా పేరున్న జేపీ వ్యక్తంచేసే అభిప్రాయాలకు కొంచెం విలువుందనే చెప్పాలి. అలాంటిది జేపీకి ఏమైందో ఏమో హఠాత్తుగా తన అభిప్రాయాల విషయంలో యూటర్న్ తీసుకున్నారు. మూడురాజధానుల కెన్సెప్టును తప్పుపట్టారు. అంతా అమరావతి ప్రాంతంలోనే కేంద్రీకృతం కావాలన్నారు. సంక్షేమపథకాల అమలువల్ల రాష్ట్రం శ్రీలంకలాగ తయారవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజధానిని బేస్ చేసుకుని మిగిలిన రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుందో హైదరాబాదే ఉదాహరణగా చెప్పారు. ఇంతకాలం చెప్పిన మాటలకు జేపీ ఇపుడు చెప్పిన మాటలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.