హైదరాబాద్ : చుట్టూ నరుక్కొస్తున్న ఈడీ
అనాదికాలం నుండి అనుసరిస్తున్న రాజనీతి ఒకటుంది. అదేమిటంటే బలవంతుడైన రాజులను దెబ్బకొట్టాలంటే శతృవులు లేదా ప్రత్యర్ధులు ఏమి చేస్తారు ? ఏమి చేస్తారంటే రాజుకి అండగా చుట్టూవున్న మద్దతుదారులను టార్గెట్ చేసుకుంటారు. మెల్లిగా ఒక్కొక్కరిని దెబ్బకొడతారు. దాంతో బలవంతుడైన రాజు బలహీనపడిపోతాడు. ఇపుడు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అలాంటి రాజనీతినే అమలుచేస్తోందంటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
కొంతకాలంగా దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్ధలు ఎన్ఫోర్మ్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ లేదా ఐటీ శాఖల ఉన్నతాధికారులు దాడులు చేస్తున్న విషయాన్ని అందరు చూస్తున్నదే. ఈ దాడులన్నీ కూడా ముఖ్యంగా బీజేపీని చాలెంజ్ చేస్తున్న పార్టీల్లోని ప్రముఖులు లేదా బీజేపీయేతర ప్రభుత్వాల్లోని ప్రముఖుల టార్గెట్ గానే జరుగుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది.
ఈ దాడుల్లో చెప్పుకోదగ్గది ఏమిటంటే వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంటశ్రీనివాసులరెడ్డి నివాసంలో కూడా సోదాలు చేయటం. అలాగే కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులిచ్చిందనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. అయితే తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత చెప్పారు. అయితే గతంలోనే కవితకు పీఏగా పనిచేసిన అభిషేక్ రావు ఇంట్లో సోదాలు చేసిన ఈడీ శుక్రవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లో సోదాలు చేయటమే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితదే కీలకపాత్రగా బీజేపీ ఎంపీలు, ఎంఎల్ఏలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఇక మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఢిల్లీ, హైదరాబాద్, నెల్లూరు నివాసాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఎంపీ కొడుకు మాగంట రాఘవరెడ్డికి నోటీసులిచ్చింది. అంటే కవిత పీఏ, ఆడిటర్ ఇళ్ళల్లో సోదాలు, విచారణకు నోటీసులు. అలాగే ఎంపీ కొడుక్కి నోటీసులు ఇళ్ళల్లో సోదాలు జరిపింది. ఇలాంటి చర్యలతో కేంద్రం ఎలాంటి సిగ్నల్స్ పంపాలని ప్రయత్నిస్తున్నట్లు ? నిజంగానే వాళ్ళకి స్కాముల్లో సంబంధాలుంటే కచ్చితంగా యాక్షన్ తీసుకోవటంలో తప్పేలేదు.