హైదరాబాద్ : కోమటిరెడ్డికి సీన్ అర్ధమైపోయిందా ?

Vijaya







కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతలకు పిచ్చెక్కించేస్తున్నారా ? తాజా పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే మునుగోడు ఉపఎన్నికలో ప్రచార బాధ్యతలంతా తనకు అప్పగిస్తే వెంటనే ప్రచారం మొదలుపెట్టేస్తానని ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో తిరిగి క్యాడర్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తానన్నట్లుగా భరోసా కూడా ఇచ్చారు.




వెంకటరెడ్డి తాజా ప్రకటనతో పార్టీలోని సీనియర్ నేతలంతా ఆశ్చర్యపోతున్నారు. నాలుగురోజుల క్రితమే తాను మునుగోడు ఉపఎన్నికల్లో పాల్గొనేది లేదని తెగేసిచెప్పారు. తనను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో కావాలనే అవమానిస్తున్నట్లు ఎంపీ మండిపోయారు. తనను పార్టీలో నుండి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతున్నదంటు ఆరోపణలు చేసారు. అడుగడుగునా తనను అవమానిస్తున్నారు కాబట్టే ఉపఎన్నికల బాధ్యత తీసుకునేదిలేదన్నారు.



నిజానికి ఒక సభలో రేవంత్ మాట్లాడుతు వ్యాఖ్యలు చేసింది, ఆరోపణలు గుప్పించింది కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదే కానీ వెంకటరెడ్డి మీదకాదు. అయితే రేవంత్ తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మీద విరుచుకుపడటాన్ని సహించలేక వెంటనే సీన్లోకి ఎంటరైపోయి రేవంత్ పై ఎదురుదాడి చేశారు. దాంతో రేవంత్ వైపు నుండి కొందరు నేతలు సీన్లోకి దూరిపోయి వెంకటరెడ్డిని నానాబూతులు తిట్టారు. దాంతో ఎంపీ మరింతగా రెచ్చిపోయారు.



ఈ నేపధ్యంలోనే ఉపఎన్నికల విషయాన్ని తాను ఆలోచించటంలేదని ప్రకటించేశారు. రోజుకో విధంగా మాట్లాడుతున్న ఎంపీని చివరకు అధిష్టానం కూడా లైటుగా తీసుకోమని లోకల్ నేతలకు చెప్పిందని ప్రచారం మొదలైంది. ఉపఎన్నిక జరిగేవరకు ఎంపీ గురించి ఎవరు పట్టించుకోవద్దని, మాట్లాడొద్దని అగ్రనేతలు ఆదేశించారట. అప్పటినుండి ఎంపీని నేతలు పట్టించుకోవటం మానేశారు. దాంతో వెంకటరెడ్డికి సీన్ అర్ధమైపోయినట్లుంది. అందుకనే ఏమాలోచించుకున్నారో ఏమో తెలీదుకానీ హఠాత్తుగా ప్రచార బాధ్యతలప్పగిస్తే ఉపఎన్నికలో దిగుతానంటు ప్రకటించారు. మరి తాజా ప్రకటనపై ఎంపీ ఎంతకాలం కట్టుబడుంటారో చూడాల్సిందే. నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో తప్ప మరేపార్టీలోను ఇమడలేరు. మరి రాజగోపాల్ ఎంతకాలం బీజేపీలో ఉంటారనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: