సచివాలయ ఉద్యోగుల కన్నీళ్లకు సమాధానం చెప్పేదెవరు..?

Deekshitha Reddy
రెండేళ్ల సర్వీసు పూర్తయిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ అన్నారు. ఆ తర్వాత డిపార్ట్ మెంటల్ టెస్ట్ లో ఉత్తీర్ణులు కావాల్సిందేన్నారు. అది కూడా పూర్తయినా ఇప్పటి వరకు 2వేల మందికి ప్రొబేషన్ డిక్లేర్ కాలేది. దీనికి కారణం ఏంటి..? వాళ్లేమైనా తప్పు చేశారా..? విధుల్లో అలసత్వం వహించారా..? ఇంకేదైనా కారణం ఉందా..? తమ తోటి ఉద్యోగులంతా పర్మినెంట్ అయిపోయి పెరిగిన జీతాలు తీసుకుంటున్న వేళ ఆ 2వేలమంది పరిస్థితి ఏంటి..?
కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఎక్కువమంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్ కాలేదని తెలుస్తోంది. అయితే దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదని, అన్ని అర్హతలున్నా.. వీరు గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే వీరికి ప్రొబేషన్ ఖరారు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందికి వివిధ కారణాల వల్ల పెరిగిన జీతాలు రాలేదు. ఆయా కారణాలతో వారు సంతృప్తిగానే ఉన్నారు. కానీ 2వేలమంది విషయంలో మాత్రం కావాలనే వారిని పక్కనపెట్టారని అంటున్నారు.
గతంలో సచివాల ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనే సందర్భంలో.. కొంతమంది నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, ర్యాలీలు చేశారు. ప్రతిపక్షాల ప్రోద్బలంతో వారు కాస్త ఆవేశపడ్డారు. సహజంగా ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెబుతున్న వైసీపీ.. మరి ఈ ఉద్యోగుల విషయంలో ఎందుకింత వివక్షతో ఉందనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందరికీ ప్రొబేషన్ ఖరారు చేసి ఆ 2వేలమందిని ఎందుకు ఆపేశారని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. మొత్తమ్మీద కారణాలేవయినా అన్ని పరీక్షలు పాస్ అయి, విధుల్లో చురుగ్గా ఉండి కూడా 2వేలమంది ప్రొబేషన్ కి నోచుకోలేకపోతున్నారు. కొత్త జీతాలకు వారు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆ 2 వేల మంది ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మరోసారి రోడ్డెక్కి ప్రభుత్వానికి మరింత పగ అవుతారా, లేక వేచి చూసే ధోరణిలో ఉంటారా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: