అమరావతి : ఇందుకే కొడాలికి ఎదురు లేదా ?
గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలన్నది చంద్రబాబునాయుడు పట్టుదల. పట్టుదలైతే ఉందికానీ ఎలా ఓడించాలో అర్ధం కావటంలేదు. గుడివాడలో కొడాలిని ఓడించేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని, నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారని, సరికొత్త వ్యూహాలతో కొడాలిని ఓడించేందుకు అస్త్రాలను తండ్రి, కొడుకులు ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారంటు మీడియాలో ఒకటే రచ్చ జరుగుతోంది.
అయితే తాజా పరిణామాలను చూస్తే అదంతా ఉత్త సొల్లుగా అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబు, రావి వెంకటేశ్వరరావులతో సమావేశం జరిగింది. వీళ్ళముగ్గురు ఎవరయ్యా అంటే గుడివాడలో చాలా సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు. కొడాలికి వ్యతిరేకంగా పోటీచేశారు కూడా. ఎవరు పోటీచేసినా కొడాలి గెలుపుకైతే ఎలాంటి సమస్య ఉండటంలేదు.
ఇంతకీ వీళ్ళ మీటింగులో తేలిందేమిటి ? ఏమిటంటే ముగ్గురికి మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఫుల్లుగా క్లాసు పీకారు. కారణం ఏమిటంటే ముగ్గురు మూడు వర్గాలుగా పార్టీలో గొడవలకు కారణమవుతున్నారట. ఏ ఒక్కవర్గమూ మిగిలిన రెండువర్గాలతో సంబంధంలేకుండా దేనిపాటికి అదే వ్యవహారాలు నడుపుతోంది. ముగ్గురు నేతల మధ్య ఏ విషయంలో కూడా సఖ్యత కనబడటంలేదు. వీళ్ళమధ్య సయోధ్యకు చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా సాధ్యంకావటంలేదు. గుడివాడ పార్టీలో ఇంత గందరగోళం ఉంటే ఇక కొడాలిని ఓడించటం ఎలా ?
ఇదే సమయంలో వైసీపీలో కొడాలికి తిరుగులేదు. నియోజకవర్గంలోని కమ్మోరి మద్దతుతో పాటు బీసీలు, ఎస్సీల మద్దతు కూడా ఉంది. ఈ కారణంగానే కొడాలి వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలుస్తునే ఉన్నారు. మరిలాంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఓడించాలనే చంద్రబాబు కల నెరవేరుతుందా ? పైగా ప్రతి ఎన్నికకు చంద్రబాబు ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపుతున్నారు. దీంతో పార్టీ బాగా వీకైపోయింది. క్యాడర్ కూడా ముగ్గురు నేతల్లో ఎవరి మాటవినాలో తేల్చుకోలేక అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. ఇందుకనే గుడివాడలో కొడాలికి తిరుగులేదని అర్ధమవుతోంది.