యముడు కరుణించాడు.. ఈ పిల్లాడు మృత్యుంజయుడు..
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండు గొలనుకుంట గ్రామానికి చెందిన మనెల్లి వెంకటేశ్వరరావు, శ్యామల దంపతుల తొలి సంతానం పూర్ణ జస్వంత్ మృత్యుంజయుడుగా మిగిలాడు. ఆ అబ్బాయి వయసు 9 ఏళ్లు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జశ్వంత్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. ఇంటి పక్కనే ఉన్న కమ్యూనిటీ హాలు వద్ద ఆడుకుంటుండగా జారిపోయి బోరుబావిలో పడ్డాడు. రాత్రి 9గంటలయినా అతను ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు ఆదుర్దా పడ్డారు. పిల్లవాడిని వెదుక్కుంటూ ఊరంతా గాలించారు. చివరకు కమ్యూనిటీ హాల్ వద్ద జస్వంత్ అంటూ కేకలు వేస్తూ తండ్రి వచ్చే సరికి కొడుకు బోరుబావిలోనుంచి తండ్రిని పిలిచాడు. డాడీ డాడీ అంటూ కేకలు వేశాడు. అప్పటికే అతను బావిలో పడి ఐదుగంటలవుతోంది. అప్పటి వరకూ ఎవరూ రాకపోవడంతో బిక్కచిక్కిపోయిన బాలుడికి తండ్రి మాట వినపడే సరికి ప్రాణం లేచొచ్చింది.
అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. 30 అడుగుల లోతైన బోరుబావినుంచి జస్వంత్ ని బయటకు తీయడం ఎవరికీ సాధ్యం కాలేదు. దాదాపు గంటసేపు లోపలికి తాళ్లు వేసి శ్రమించారు కానీ జస్వంత్ వాటిని పట్టుకుని పైకి రావడం సాధ్యం కాలేదు. చివరకు స్థానిక యువకుడు సురేష్ ధైర్యం చేశాడు. తన నడుముకు తాడు కట్టుకుని బోరుబావిలోకి దిగాడు. లోపలికి వెళ్లి ఓ కర్రసాయంతో జస్వంత్ ని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. అక్కడినుంచి అతడిని కూడా తాడుకు కట్టి పైకి లాక్కొచ్చాడు. సురేష్ ధైర్యం చేసి లోపలికి దిగడంతో ఏడున్నర గంటల పోరాటం తర్వాత ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బోరుబావిలో పడిన జస్వంత్ ప్రాణాపాయం లేకుండా బయటపడటంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సురేష్ ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. అతడు ధైర్యం చేసి లోపలకు దిగడం వల్లే జస్వంత్ బయటపడగలిగాడని అంటున్నారు.