కోస్తా : జనాధరణ తగ్గలేదని సర్టిఫికేట్ ఇచ్చిన ఎల్లోమీడియా

Vijaya



నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా ఎల్లోమీడియా అత్యుత్సాహం వల్ల చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే తగిలింది. ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డికి 82 వేల ఓట్ల మెజారిటి వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్ధికి 102240 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ కు 19,352 ఓట్లొచ్చాయి. అంటే విక్రమ్ కు వచ్చిన మెజారిటి 82,888 ఓట్లు. నిజానికి వైసీపీ లక్ష ఓట్ల మెజారిటి ఆశించినా 82 వేల దగ్గరే ఆగిపోయింది.




మామూలుగా ఉపఎన్నిక అంటే అధికారపార్టీకి అనుకూలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే యావత్ యంత్రాంగమంతా చేతిలో ఉంటుంది కాబట్టి అధికారపార్టీ గెలుపు చాలా తేలిక. కానీ ఆత్మకూరు ఉపఎన్నికలో మాత్రం యంత్రాంగం వైసీపీకి ఏమాత్రం సహకరించలేదని ఎల్లోమీడియానే తేల్చిచెప్పింది. ఓటర్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనబడినట్లు చెప్పింది. ఉపఎన్నిక చాలా పద్దతిగా జరిగిందని యంత్రాంగం ఏమాత్రం సహకరించలేదన్నది.




మూడు రోజుల క్రితం ‘వైసీపీపై మొహం మొత్తిందా’ అనే కథనంలోనే ఇదంతా రాసుకొచ్చింది. ప్రభుత్వం మీద తమకున్న వ్యతిరేకతను వ్యక్తంచేయటానికి ఉద్యోగులంతా ఉపఎన్నికను వేదికగా చేసుకున్నారట. దొంగఓట్లు వేయటానికి అధికారపార్టీ నేతలకు ఉద్యోగులు ఏమాత్రం సహకరించలేదని చెప్పింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే చాలాచోట్ల ఉద్యోగులు దొంగఓట్లను అడ్డుకున్నట్లు కూడా చెప్పింది. వృద్ధులకు, వికలాంగులకు సాయంగా వచ్చేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను ఉద్యోగులు అడ్డుకుని పోలింగ్ కేంద్రాల దగ్గరకు కూడా రానీయలేదట.




ఉపఎన్నిక జరిగిన విధానం, ఉద్యోగుల వైఖరి చూసిన తర్వాత అధికారపార్టీకి చుక్కలు కనబడటం ఖాయమన్నట్లుగా ఎల్లోమీడియా కథనం రాసింది. ఉపఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గటం కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కారణమని  తేల్చేసింది. చివరకు ఫలితంలో తేలిందేమిటి ? ఓటింగ్ శాతం తగ్గినా, ఉద్యోగులు సహకరించకపోయినా, చాలా పద్దతిగా జరిగిన పోలింగ్ లో  వైసీపీకి 82 వేల ఓట్ల మెజారిటి వచ్చిందంటే అర్ధమేంటి ? జనాల్లో జగన్ పై ఆధరణ తగ్గలేదనే కదా. ఉపఎన్నిక ఇంత పద్దతిగా జరిగిన తర్వాత అధికార దుర్వినియోగం జరగిందని చంద్రబాబునాయుడు అండ్ కో చెప్పేందుకు లేకుండా పోయింది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: