ఆత్మకూరులో అధికార పార్టీకి లక్ష మెజార్టీ వస్తుందా..?

Deekshitha Reddy
తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించినా.. వారు ఊహించిన స్థాయిలో మెజార్టీలు రాలేదు. ఈసారి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని ఆధికార పార్టీ చెబుతోంది. లక్ష ఓట్ల మెజార్టీ అంటే మాటలు కాదు. అందులోనూ ఉప ఎన్నికలు, పైగా ఎండలు.. ఓటరు అసలు పోలింగ్ పై ఆసక్తితో ఉన్నారా లేదా అనేది కూడా అనుమానమే. కానీ అధికార పార్టీ గెలుపుని ప్రామాణికంగా తీసుకోవడంలేదు, కేవలం మెజార్టీని మాత్రమే లెక్కలోకి తీసుకుంటోంది. లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఉప ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముగిసింది. దీంతో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రచారం..  
ఆత్మకూరులో అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి మద్దతుగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేపట్టారు. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీల ముఖ్య నేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచార ఘట్టం పూర్తయింది. అధికారుల ఆదేశాలతో.. బయటి ప్రాంతాలనుంచి వచ్చినవారంతా నియోజకవర్గం వదిలి వెళ్లిపోయారు. స్థానిక నాయకులు పోల్ పర్సంటేజీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముమ్మర ఏర్పాట్లు..
మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికలకు మరికొద్దిగంటల సమయే మిగిలి ఉండటంతో.. అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కోసం 279 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1132 మంది పోలింగ్ సిబ్బంది, 148 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది ఈ పోలింగ్ వ్యవహారంలో పాల్గొంటున్నారు. మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అనుకున్నది సాధిస్తుందా, లక్ష ఓట్ల మెజార్టీ వారికి సాధ్యమేనా అన్నది ఈనెల 26న ఫలితాల తర్వాత తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: