చంద్రబాబుపై కొడాలి మార్క్ పంచ్.. అదిరిపోయిందిగా..

Deekshitha Reddy
ఇటీవల కొడాలి నాని పంచ్ ల ప్రవాహం కాస్త నెమ్మదించింది. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన అప్పుడప్పుడూ ప్రతిపక్షాలకు చాకిరేవు పెడుతున్నారు. తాజాగా మహానాడు సందర్భంగా మరోసారి ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. మహానాడులో చంద్రబాబు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు కొడాలి నాని. ఏపీకి, టీడీపీకి పట్టిన శని బాబు అని అన్నారు. అధికారమే బాబు పరమావధి అని చెప్పిన కొడాలి నాని, ఎన్టీఆర్ పేరు చెబితే ఇప్పటికీ చంద్రబాబుకు తడిచిపోతుందని సెటైర్లు వేశారు. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్.. ఈ రెండిట్లో ఏ పేరు విన్నా కూడా చంద్రబాబుకు నిద్ర పట్టదని విమర్శించారు కొడాలి నాని. జనం 23 సీట్లకు పరిమితం చేసి వెళ్లగొట్టినా.. ఇంకా చంద్రబాబు రాజకీయాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనికిరారని ప్రజలు డిసైడ్ చేశారని, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, కానీ ఆయన ప్రతిపక్ష నేతగా కూడా పనికి రారని చెప్పారు కొడాలి నాని. అమలాపురంలో తన మనుషులతో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులపెట్టించారని మండిపడ్డారు కొడాలి నాని. మహానాడులో అడ్రస్ లేని వాళ్లకి అవకాశమిచ్చారని, ఓడిపోయిన తర్వాత టీడీపీ నేతల అడ్రస్ గల్లంతయిందని, వారందర్నీ మహానాడులో చంద్రబాబు పక్కన కూర్చోపెట్టుకున్నారని అన్నారు. సీఎం జగన్ గట్టిగా ఓ చూపు చూస్తే చాలు ఇలాంటి బ్యాచ్ అంతా పరారై పోతుందని అన్నారు నాని.
వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేసిందని చెప్పారు నాని. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యథిక పదవులు ఇచ్చిన ఘతన జగన్ ది అని గుర్తు చేశారు నాని. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందర్నీ రాజకీయంగా, సామాజికంగా పైకి తెస్తున్నారని, అది నచ్చక టీడీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 50 శాతం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్న జగన్ ని ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు. ఆఖరికి బస్సు యాత్ర మీద కూడా చంద్రబాబు విషం కక్కుతున్నారని, కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని నిర్వహించుకుంటున్న మహానాడుకి, వైసీపీ చేపట్టిన బస్సు యాత్రకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కొడాలి నాని. కనీసం కన్న కొడుకుని కూడా గెలిపించుకోలేని దద్దమ్మ చంద్రబాబు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: