అమరావతి : వెళ్ళిపోయే మంత్రులు చాలా లక్కీయేనా ?
మంత్రివర్గం నుండి డ్రాపవ్వబోయే మంత్రులు ఒక విధంగా లక్కీలనే చెప్పాలి. ఎందుకంటే మూడేళ్ళు మంత్రిపదవులను అనుభవించి, ప్రోటోకాల్ ఎంజాయ్ చేసి కామ్ గా పదవుల నుండి దిగిపోతున్నారు. మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసి మూడేళ్ళవుతోంది. వీళ్ళపై ఎలాంటి ఒత్తిళ్ళు కనబడలేదు. మూడేళ్ళల్లో సుమారు ఏడాదిన్నర కరోనా కాలంతోనే గడచిపోయింది.
కరోనా కాలంలో వైద్య-ఆరోగ్య, పోలీసు శాఖలకు తప్ప మిగిలిన శాఖల మంత్రులకు పెద్దగా పనిలేదు. పనిలేదు కదాని వాళ్ళు మంత్రులు కాదనేందుకు లేదు. పదవులు పదవులే ప్రోటోకాల్ ప్రోటోకాలే. ఆ విధంగా చాలామంది మంత్రులు బాధ్యతలు లేని అధికారాలను అనుభవించారు. ఇదే సమయంలో పార్టీపరంగా కూడా ఎదుర్కొన్న ఒత్తిళ్ళు కూడా ఏమీలేవనే చెప్పాలి. అంటే శాఖల పరంగా కానీ అటు పార్టీపరంగా కానీ పెద్దగా ఒత్తిళ్ళు లేవు. చాలామంది మంత్రులు హ్యాపీగా మూడేళ్ళకాలం గడిపేశారనే చెప్పాలి. అందుకనే మంత్రివర్గంలో నుండి బయటకు వెళ్ళేవాళ్ళు హ్యాపీ.
అందుకనే మంత్రివర్గం నుండి పక్కకుపోతున్న వాళ్ళంతా హ్యాపీఅనే చెప్పాలి. ఇదే సమయంలో కొలువుదీరబోయే మంత్రివర్గంలో వాళ్ళకు మాత్రం మంత్రిపదవులు ముళ్ళ కిరీటాలనే చెప్పాలి. షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది రెండేళ్ళే. అంటే ఈ రెండేళ్ళల్లో చివరి ఏడాది ఎన్నికల సంవత్సరాన్ని తీసేస్తే మిగిలింది ఏడాది మాత్రమే. శాఖలపరంగా వీళ్ళేమీ చేసినా మొదటి ఏడాదిలోనే చేయాలి.
ఒకవైపు శాఖాపరమైన ఒత్తిడి మరోవైపు పనుల కోసం ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళు. ఒకవైపు ప్రభుత్వ వ్యవహారాలను చూసుకుంటునే మరోవైపు పార్టీ బలోపేతానికి నానా అవస్తలు పడాలి. జిల్లాల నేతల మధ్యున్న పంచాయితీలను తీర్చాలి. లేకపోతే దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పడుతుంది. పైగా కొత్తమంత్రుల పనితీరును జగన్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. అంటే కొత్తమంత్రుల పనితీరు ఇటు జనాలు, పార్టీ నేతలను మెప్పించాలి అటు జగన్‌నూ మెప్పించాలన్నమాట. ఇన్ని సమస్యల మధ్య కొత్తమంత్రుల తలలు బొప్పికట్టడం ఖాయమే. అందుకనే వెళిపోతున్న మంత్రులు చాలా హ్యాపీయని పార్టీలో చెప్పుకుంటున్నారు.