హమ్మయ్య : శాంతి చర్చల్లో పురోగతి !

NAGARJUNA NAKKA
రష్యా ఉక్రెయిన్ మధ్య ఇస్తాంబుల్ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ పై రష్యా సైనిక కార్యకలాపాల తగ్గింపుకు రష్యా అంగీకారం తెలపగా.. కీవ్ చెర్నిగీవ్ లో సైనిక కార్యకలాపాల తగ్గింపునకు సుముఖత తెలియజేసింది. అటు ఉక్రెయిన్ నుంచి రష్యా శాంతి ఒప్పందం కోరగా.. ఒప్పందం కుదిరితే జెలెన్ స్కీ.. పుతిన్ మధ్య భేటీ జరిగే అవకాశముంది.
మరోవైపు రష్యా సైనికులు ఉక్రెయిన్ లో దారుణాలకు పాల్పడుతున్నారు. తన భర్తను చంపి తనపై అత్యాచారం చేశారని ఓ ఉక్రెయిన్ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మొదట తన భర్తను చంపారనీ.. అది చూసి తాను గట్టిగా అరవడంతో పక్క గదిలో ఉన్న నాలుగేళ్ల కుమారుడు బిగ్గరగా ఏడ్చాడు. అయినా సైనికులు తన తలపై గన్నుపెట్టి దుస్తులు విప్పాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్టు విలపించింది. దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
ఇక రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అధికారంలో కొనసాగకూడదని తాను చేసిన వ్యాఖ్య కేవలం నైతిక ఆగ్రహమేనని.. రష్యాలో అధికార మార్పు తన విధానం కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పోలండ్ పర్యటనలో పుతిన్ ఓ కసాయి.. అధికారంలో కొనసాగకూడదంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ తరుణంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోననీ.. పుతిన్ కు ఎలాంటి క్షమాపణలు చెప్పనని బైడెన్ స్పష్టం చేశారు.
ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధాన్ని ముగించాలని అందరూ కోరుకుంటున్నారు. తాజాగా రష్యన్ సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి జ్వొనరేవా కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నో వార్ అని రాసి ఉన్న క్యాప్ తలకు ధరించి మ్యాచ్ ఆడింది. మియామి ఓపెన్ లో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో మూడో రౌండ్ జరుగుతున్న సమయంలో ఆమె ఈ క్యాప్ తో సందేశం ఇచ్చింది. ఆమె 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచింది.
ఇదిలా ఉంటే.. తమ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు మరిన్ని అత్యాధునిక క్షిపణులను తయారు చేసి ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ స్పష్టం చేశారు. ఎవరూ ఆపలేని శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడే ఓ వ్యక్తి యుద్ధాన్ని నిరోధించగలడని అభిప్రాయపడ్డారు. అప్పుడే సామ్రాజ్యవాదులు బెదిరింపులను అదుపులో ఉంచగలడు అని పేర్కొన్నాడు. ఇటీవలే వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించే భారీ ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్ 17ను ఉత్తరకొరియా ప్రయోగించింది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: