3 రోజులు జాగ్రత్త.. ఏపీలో హై అలర్ట్..
ఇక అసలు విషయానికొస్తే.. మరో మూడు రోజులపాటు ఏపీలో ఎండలు, వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా వడ గాలుల తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పొడిగాలులతో ఎండ తీవ్రత మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. ఉష్ణోగ్రత రీడింగ్ 40 డిగ్రీలు సూచిస్తున్నా.. ఎండ తీవ్రత 44 డిగ్రీలకు పైగానే ఉంటుంది.
అల్పపీడనంతో అధిక ప్రభావం..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వాతావరణంపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 19న ఈ అల్పపీడనం తీవ్రమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది మార్చి 20న వాయుగుండంగా మారే అవకాశముంది. మార్చి 21న తుపానుగా మారి 23న బంగ్లాదేశ్, మయన్మార్ పరిసరాల్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడవు. దానికి ప్రతిగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. గాలిలోని తేమని ఈ తుపాను లాగేస్తుందని, దీంతో పొడి వాతావరణం మరింత ఎక్కువైపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఎండ తీవ్రత భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరో మూడురోజులపాటు అప్రమత్తత అవసరం అని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటకు రావద్దని, ఒకవేళ పనులమీద బయటకు వచ్చేవారు కచ్చితంగా మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని, ద్రవపదార్థాలను తీసుకోవడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. మూడు రోజులపాటు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.