మళ్లీ మంత్రిగా పేర్ని నాని కన్ఫామ్.. ఇదే సాక్ష్యం..

Deekshitha Reddy
మత్రి వర్గంలో ఉండేదెవరు వెళ్లేదెవరు.. రెండు రోజుల్లో తేలిపోయే విషయమే అయినా ఇదిప్పుడు ఏపీలో అతి పెద్ద చర్చకు తావిస్తోంది. అందరూ పోయి ఒకరిద్దరు మిగులుతారు కాబట్టి, ఆ మిగిలేవారెవరు అనేదానిపైనే చర్చ నడుస్తోంది. దాదాపుగా పదవులు పోతాయని సంకేతాలున్నవారంతా సైలెంట్ అయ్యారు. సహజంగానే వారంతా ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు, అందులోనూ ఈ టైమ్ లో ఆ సాహసం అస్సలు చేయట్లేదు. ఇక ఇటీవల పేర్ని నాని రోజుకో ప్రెస్ మీట్ తో కనపడుతున్నారు. అది కూడా తన పోర్ట్ ఫోలియో విషయాలతోనే ఆయన హైలెట్ అవుతున్నారు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలపై ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ లెక్కన పేర్ని నాని పోస్ట్ కన్ఫామ్ అయినట్టేనా అనే వార్తలొస్తున్నాయి.

పేర్ని నాని మొదట్నుంచీ వైఎస్ జగన్ కేబినెట్ లో కీలకంగా ఉన్నారు. అందులోనూ ఆయనకు రవాణాతోపాటు, సమాచార ప్రసార శాఖ, సినిమాటోగ్రఫీ కూడా ఉండటంతో కేబినెట్ నిర్ణయాలన్నీ ఆయనే మీడియాకు వెల్లడించేవారు. అంతే కాదు.. సినిమా టికెట్ల వివాదం తర్వాత కూడా పేర్ని నాని చురుగ్గా వ్యవహరించారు. అటు సినిమా ఇండస్ట్రీకి నష్టం జరగకుండా, ఇటు ప్రజలపై టికెట్ రేట్ల భారం పెరగకుండా మధ్యే మార్గం అణ్వేషించారు. ప్రభుత్వం మెరుగైన నిర్ణయం తీసుకునే విషయంలో ఆయన కృషి ఎన్నదగినది.

తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చారు మంత్రి పేర్ని నాని. 60ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ గతంలో టికెట్ పై 25 శాతం రాయితీ ఇచ్చేది. దాన్ని ఇప్పుడు తిరిగి పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి నాని ప్రకటించారు. ఇక ఇతర ప్రభుత్వ శాఖల్లో లాగా.. ఏపీఎస్ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 1800లకు పైగా కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో.. ఆర్టీసీపై కూడా పెను భారం పడుతోంది. కానీ టికెట్ల రేట్లు పెంచలేదు ఆర్టీసీ. అంటే ఆ భారం అంతా సంస్థపైనే పడుతోంది. ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల రూట్ మ్యాప్ కూడా ఆయన ప్రకటించారు.

మొత్తమ్మీద.. మిగతా మంత్రులంతా సైలెంట్ గా ఉన్నా కూడా.. పేర్ని నాని మాత్రం వరుస ప్రెస్ మీట్లతో హుషారుగానే ఉన్నారు. ఆయనకు ముందస్తు సమాచారం ఉందని మిగతావారు గుసగుసలాడుకుంటున్నారు. జగన్ సెకండ్ టీమ్ లో కూడా పేర్ని నాని కొనసాగుతారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: