రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తోన్న రష్యా..!
మరోవైపు రష్యాలోని తమ దేశ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే రష్యాను వీడాలని సూచించింది. ఇప్పటికే అమెరికా.. రష్యా రాజధాని మాస్కోలోని తమ రాయబార కార్యాలయానికి చెందిన నాన్-ఎమర్జెన్సీ సిబ్బంది, కుటుంబ సభ్యులను స్వచ్ఛందంగా వెనక్కి రావాలని ఆదేశించింది.
ఇక లాట్వియా నుంచి ఉక్రెయిన్ కు ఊహించని సాయం అందింది. ఉక్రెయిన్ లో ఉన్న లాట్వియా పౌరులు ఉక్రెయిన్ తరఫున యుద్ధంలో పోరాడటానికి ఆ దేశ పార్లమెంట్ అనుమతిచ్చింది. ఇరు దేశాల ఉమ్మడి భద్రత, ఉక్రెయిన్ స్వాతంత్ర్యం కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే తమ పౌరులు తప్పనిసరిగా అలా చేయగలరు అని పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్లమెంట్ లో చట్ట సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఇక రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. సుమారు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తక్షణమే రష్యా కాల్పుల విరమణ చేసి.. తమ దేశం నుంచి వెనక్కి వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. క్రిమియా నుంచి కూడా రష్యా సైన్యాన్ని వెనక్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ హామీ ఇవ్వాలని రష్యా కోరింది.
మరోవైపు ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడిన రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షల విధింపు కొనసాగుతోంది. పుతిన్, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్ లోని సభ్యులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించింది. మరోవైపు స్విఫ్ట్ నుంచి కొన్ని రష్యా బ్యాంకులను బ్యాన్ చేసిన సౌత్ కొరియా.. తాజాగా ఆ దేశ వ్యూహాత్మక ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. రష్యాకు వత్తాసు పలుకుతున్న బెలారస్ పై జపాన్ ఆంక్షలు విధించింది.