ప్రత్యేక హోదాపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు..!

MOHAN BABU
విభజనలో మళ్లీ వివాదం రాజుకుంది. విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సమావేశం ఎజెండా నుంచి హోదాని తొలగించడాన్ని ప్రభుత్వం తప్పుబడుతుంటే బిజెపి మాత్రం సమర్థించుకుంటోంది. మరోవైపు వైసీపీ నేతలంతా పదవులకు రాజీనామా చేసి  ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేస్తుంది టీడీపీ. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రచ్చ కొనసాగుతోంది. ఏపీ కి హోదా ఇవ్వకపోయినా వివిధ రూపాల్లో కేంద్రం నుంచి నిధులు అందుతున్నా యంటోంది బిజెపి.

కేంద్రం ఇస్తున్న వేలకోట్ల రూపాయలతోనే  ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు బిజెపి ఎంపీ జీవీఎల్. అంతే కాదు ఇప్పుడు అధికారంలో ఉన్న వైసిపి గతంలో ఏలిన కాంగ్రెస్, టిడిపి వల్లే రాష్ట్రం నష్టపోయిందన్నారాయన. విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సమావేశానికి ప్రత్యేక హోదా తో సంబంధం లేదన్నారు సోము వీర్రాజు. ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. హోదా ఇవ్వాల్సింది కేంద్రమని, తీసుకోవాల్సింది రాష్ట్రం అన్నారు. గత ప్రభుత్వం ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసిందని,వాటిని కొనసాగించాలన్నారు సోము వీర్రాజు. విభజన ఎజెండాలో హోదా అంశాన్ని కేంద్రం చేరిస్తే చంద్రబాబు సలహాతో జీవీఎల్ దానిని తప్పించేశారని ఆరోపించారు మంత్రి పేర్ని నాని.రాష్ట్ర అభివృద్ధికి జీవీఎల్ కృషి చెయ్యరు కానీ హోదా రద్దు కు ప్రత్యేకంగా పని చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

వైసిపి ఎంపీలు పార్లమెంటులో అనేకసార్లు హోదా అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు బొత్స  సత్యనారాయణ. ఇటీవల ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్ అందులో హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు టిడిపి నేత పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్. వైసిపి నేతలంతా తమ పదవులకు రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై వైసీపీ యుద్ధం ప్రకటిస్తే ప్రజలతోపాటు టిడిపి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు  పయ్యావుల కేశవ్. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సమావేశం ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం తర్వాత దాన్ని తొలగించడం తో రేగిన దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: