ఆ అడవుల జిల్లాలో అదిరిపోయేలా పర్యాటకం..?
ఆదిలాబాద్ అందాల జిల్లా.. ఈ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.. కుంటాల జలపాతాలు ఇక్కడే ఉన్నాయి. ఉట్నూర్ లో చారిత్రాత్మక గిరిజన కోట కూడా ఉంది. మిట్టే, సప్తగుండాల జలపాతాల వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిన్నిటినీ అభివృద్ధి చేసేలా ఈ నివేదిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయం రూ.9 కోట్లుగా నిర్ణయించారు.
ఈ ప్రాంతాలను బాగా అభివృద్ధి చేస్తే.. రాష్ట్రం నుంచి మాత్రమే కాక.. దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించ వచ్చని అధికారులు అంటున్నారు. ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్, ట్రైబల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వింగ్.. ఈ రెండు మూడేళ్ల క్రితమే ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించే బాధ్యతను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. అయితే నివేదిక తయారీలో బాగా జాప్యం జరిగింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారికి ఈ నివేదిక అందింది.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలి.. ఇంకా కొత్తగా ఎలాంటి ఆకర్షణలు జోడించాలి.. మౌలిక వసతులు ఎలా మెరుగుపరచాలి.. వంటి అంశాల్లో చర్యలు తీసుకునేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని.. కాటేజీలు నిర్మించేందుకు రూ.4 కోట్లు కేటాయించామని అధికారులు చెబుతున్నారు. జలపాతాల వద్ద పర్యాటకుల సౌకర్యార్థం వ్యూపాయింట్‌లను అభివృద్ధి చేస్తారు. గిరిజన కోటను రూ.3.50 కోట్ల నిధులతో హైదరాబాద్ శిల్పారామం టైపులో అభివృద్ధి చేయనున్నారు.