తెలంగాణ రాష్ట్రంపై ఇంత అక్కసా 'మోదీ సార్'?
ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో వారే చూసుకుంటారు. కానీ ఈ విషయంపై పార్లమెంట్ లో రెండు రోజుల క్రితం జరిగిన చర్చలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్ర విభజన అందరి అభిప్రాయాలతో జరగలేదని, అందులో ఏదో కుమ్మక్కు ఉందని కామెంట్ చేయడంతో తెలంగాణ ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆయన వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఎంపీలు కె కేశవరావు, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ లు ప్రధాని మోదీపై సభా ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది పూర్తిగా రూల్ నెంబర్ 187 ను అతిక్రమించడమే అవుతుందని సదరు ఎంపీలు మోదీపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
అంతే కాకుండా ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుందని అంటున్నారు. అయితే మోదీ మనసులో తెలంగాణ రాష్ట్రంపై అభిప్రాయం ఆ విధంగా ఉంది కాబట్టి బడ్జెట్ లోనూ పెద్దగా ఇవ్వలేదని మరి కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రావడం మోదీకి ఇష్టం లేదు కాబట్టే ఈ తరహా వ్యాఖ్యలు చేసారని తెరాస నాయకులు మాట్లాడుతున్నారు. ఎలాగో రాష్ట్రము వచ్చింది... మరి దానిపై మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అంటూ కొందరు బీజేపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకు మోదీకి తెలంగాణ రాష్ట్రంపై ఇంత అక్కసు అంటూ తెలంగాణ ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి...