ఢిల్లీ : ఏపీని మోడి కుళ్ళబొడిచేశారా ?
ఐదుగురు కలిసి ఏపీని నాశనం చేసేశారు. కాంగ్రెస్+బీజేపీలు కూడబలుక్కుని అడ్డుగోలుగా రాష్ట్రాన్ని 2014లో విభజించారు. దీనితో విభజిత ఏపి నాశనానికి మొదటి అంకం పూర్తయ్యింది. ఎన్నికల్లో ప్రధానమంత్రి అయిన నరేంద్రమోడి ఏపి ప్రయోజనాలను పూర్తిగా దెబ్బ కొట్టడంతో రెండవ అంకాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు. నాలుగేళ్ళు ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబునాయుడు నరేంద్రమోడి సర్కార్ కు పూర్తిగా కుదవపెట్టేయటంతో మూడవ అంకం కూడా పూర్తయిపోయింది.
అభివృద్ధిపరంగా ఏపీ నాశనమైపోవటంలో వెంకయ్యనాయుడు పాత్ర రూపంలో నాలుగవ అంకం జరిగిపోయింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదవ అంకం జరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చేనాటికే మొదటి నాలుగు అంకాలు జరిగిపోయాయని గ్రహించాలి. అయితే అప్పటికే ఆర్ధికంగా దెబ్బతినేసిన రాష్ట్రంపై జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల రూపంలో ఐదవ అంకం జరుగుతోంది. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తేలేకపోవటం జగన్ చేతకాని తనమనే చెప్పాలి.
హోలు మొత్తంమీద చూస్తే మంగళవారం పార్లమెంటులో రాష్ట్ర విభజన, ఏపికి జరిగిన అన్యాయంపై మొసలి కన్నీరు కార్చారనే చెప్పాలి. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు ఎంత పాపముందో అంతే పాపం బీజేపీకి కూడా తగులుతుంది. కాకపోతే అప్పటికి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టే పాపంలో మెజారిటి వాట హస్తంపార్టీ ఖాతాలోకి పడింది. సరే విభజన జరిగిపోయింది కాబట్టి ఎవరు ఏమీ చేయలేరని అనుకుందాం. మరి ప్రధానమంత్రిగా ఉండి మోడి చేస్తున్నదేమిటి ? అయినా సందర్భం లేకుండా మోడి ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తారో అర్ధం కావటంలేదు.
విభజన చట్టంలోని ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఎందుకివ్వలేదు ? వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు ఎందుకు ఆపేశారు ? పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇవ్వటంలేదు ? వీటిన్నింటిని తుంగలో తొక్కేయటం ద్వారా ఏపీ అభివృద్ధిని మోడి కుళ్ళబొడిచేస్తున్నారు. అంటే రాష్ట్రం దెబ్బతినటంలో కాంగ్రెస్+బీజేపీకి ఎంత పాత్రుందో నరేంద్రమోడికి అంతకుమించి పాత్రే ఉంది. ఏపీని కాంగ్రెస్ దెబ్బకొట్టిందని ఇపుడు మొసలి కన్నీరు కార్చటం కాదు తాను కూడా అదే చేస్తున్నానని మోడి గుర్తుంచుకోవాలి. అందుకనే కాంగ్రెస్, బీజేపీలకు జనాలు సమానంగా బుద్ధిచెబుతున్నారు.