మోదీ బ‌డ్జెట్ : తెలుగు వారికి ద‌క్కిందేంటంటే?

RATNA KISHORE
ఏటా మాదిరిగానే మాట‌లు చెప్పే బ‌డ్జెట్ కు అంకెలు తోడు. ఎలానూ మ‌నం మోస‌పోయాం అని తేలిపోయాక బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని వ‌దిలేసి మ‌న ఎంపీలు బ‌య‌ట‌కు వ‌చ్చినా బాగుండేది. ఈ ఏడాది కాదు క‌దా మ‌రో వందేళ్లు అయినా కేంద్రం ఇచ్చే బిచ్చం మ‌న తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కి కానీ అభ్యున్నతికి కానీ తోడ్ప‌డ‌వు అన్న‌ది సుస్ప‌ష్టం.అయినా ఆశ చావ‌క మ‌నం మ‌న ప‌నులు చేసుకుంటూ పోవాలి. అడ‌గాల్సిందేదో అడిగినా కూడా బిచ్చ‌మే వేస్తాం అంటే ఏమ‌నుకోవాలి?


సార్వ‌త్రిక బ‌డ్జెట్ ద్వారా తెలుగు వారికి ద‌క్కిందేమీ లేద‌ని తేలిపోయింది.ప్ర‌ధాన ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వ‌కుండా న‌దుల అనుసంధానంపై ఎప్ప‌టిలానే పాత పాట ఒక‌టి పాడారు. కృష్ణా గోదావ‌రితో స‌హా మిగిలిన న‌దుల అనుసంధానంపై ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు. అంతేకాదు పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కానీ కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కానీ నిధుల విదిలింపు అన్న‌ది లేనేలేదు. ఇప్ప‌టికే జ‌ల‌వివాదాలు న‌డుస్తున్న త‌రుణంలో న‌దుల అనుసంధానం అన్న‌ది అనుకున్నంత సులువు కాదు.అయినా వాటికి కేటాయించే నిధుల‌పై కూడా ఇవాళ ఆమెకు స్ప‌ష్ట‌త లేదు.


ఇక ఆమె చెబుతున్న విధంగా న‌దుల‌ను అనుసంధానం చేయాలంటే ముందు అంత‌రాష్ట్ర జ‌ల వివాదాలు ప‌రిష్కారం చేయాలి. ఇందులో చాలా స‌మ‌స్య‌లు కోర్టుల చుట్టూ తిరుగాడుతున్నాయి.ఇప్ప‌టికీ ఆంధ్రా,తెలంగాణ మ‌ధ్య కృష్ణా జ‌లాల పంపిణీ పై తగువు తేల‌నేలేదు. అదేవిధంగా త‌మిళనాడు క‌ర్ణాట‌క మ‌ధ్య కావేరీ జ‌ల‌వివాదం  మొన్న‌టి వేళ కొలిక్కి వ‌చ్చింది. 2018లో సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఇరు రాష్ట్రాల‌కూ కాస్త త‌గువు తీరింది.


ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా జ‌ల వివాదాలు అప‌రిష్కృత ధోర‌ణిలో ఉన్నా కూడా అవేవీ ప‌ట్టించుకున్న దాఖ‌లాలే లేవు. రాష్ట్రాల మ‌ధ్య త‌గువులు వ‌చ్చిన ప్ర‌తిసారీ కేంద్రం ప్రేక్ష‌క పాత్ర‌కే ప‌రిమితం అవుతోంది. ఇలాంటి సంద‌ర్భంలో న‌దుల అనుసంధానం అన్న‌ది కుద‌ర‌ని ప‌ని కానీ కేంద్రం త‌ర‌ఫున ఆమె చెబుతున్న మాట‌లు మాత్రం చాలా గంభీరంగానే ఉన్నాయి. ఇప్ప‌టికీ ఒడిశా ఆంధ్రా మ‌ధ్య నెల‌కొన్న వంశ‌ధార జ‌ల వివాదం ప‌రిష్కృతం కాని త‌రుణాన ఆ విష‌య‌మై అస్స‌లు ప‌ట్టించుకోకుండా న‌టిస్తున్న కేంద్రం ఎలా అని నదుల అనుసంధానం అంటూ సంబ‌ర‌ప‌డుతుందో అర్థం కావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: