ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. ఎప్పటినుంచంటే..?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆంక్షలు ఓ మోస్తరుగా మాత్రమే అమలు చేశారు. ఏపీలో నైట్ కర్ఫ్యూ పెట్టారు, స్కూళ్లకు సెలవు ఇవ్వలేదు. తెలంగాణలో స్కూళ్లు మూసేశారు, నైట్ కర్ఫ్యూ పెట్టలేదు. తాజాగా తెలంగాణలో స్కూల్స్ ని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 1నుంచి తెలంగాణలో విద్యాసంస్థలన్నీ మొదలవుతాయి. ఆన్ లైన్ క్లాసులు ఆపేసి, ప్రత్యక్ష తరగతులు మొదలవుతాయి. ఈ దశలో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో నైట్ కర్ఫ్యూ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.
ఏపీలో నైట్ కర్ఫ్యూపై సమాలోచనలు..
ప్రస్తుతం ఏపీలో నైట్ కర్ఫ్యూని కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే కర్ఫ్యూని ఎత్తేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేసుల సంఖ్య తగ్గడంతో ప్రభుత్వం ఆంక్షల సడలింపుకోసం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొవిడ్ ప్రొటోకాల్స్ లో మార్పులొస్తున్నాయి, అటు ఇతర రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూ విషయంలో ఆంక్షల సడలింపుకే సానుకూలంగా ఉన్నాయి. దీంతో ఏపీలో కూడా వ్యాపార వర్గాలనుంచి ప్రభుత్వానికి విజ్ఞాపనలు వస్తున్నట్టు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏపీలో కూడా ఫిబ్రవరి 1 నుంచి నైట్ కర్ఫ్యూని తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రాత్రి కర్ఫ్యూని తొలగించినా.. సినిమా హాళ్లను 50శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ ముప్పు పూర్తిగా తొలగిపోయింది అనుకున్న తర్వాతే ఆంక్షల్ని పూర్తి స్థాయిలో ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.