అమరావతి : ఉద్యోగులే కరోనాకు సూపర్ స్ర్పెడర్లవుతున్నారా ?
ప్రభుత్వ ఉద్యోగులే కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారా ? ఉద్యోగుల వైఖరి చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు తమ డిమాండ్ల సాధనకోసమని ఉద్యోగులు రోడ్లపైకి ఎక్కారు. రకరకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనల పేరుతో వందలు, వేలాదిమంది టీచర్లు, ఉద్యోగులు రోడ్లపైకి చేరుకుంటున్నారు.
ఉద్యోగులు, టీచర్ల ఆందోళనలు, నిరసనల కారణంగా కరోనా వైరస్ బాగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. గడచిన పదిరోజులుగా రాష్ట్రంలో కేసులు పెరిగిపోవటానికి సమ్మె కూడా కారణమవుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలే దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మరటానికి ప్రధాన కారణాలయ్యాయి.
ఇపుదు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ థర్డ్ వేవ్ కేసులు నమోదవుతున్నాయి. నిర్లక్ష్యంగా ఉంటే థర్మ్ వేవే ప్రాణాంతకమవుతుందని డాక్టర్లు వార్నింగులిస్తున్నారు. జనాలంతా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటు కేంద్రప్రభుత్వం పదే పదే చెబుతోంది. థర్డ్ వేవ్ లో కూడా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, తెలంగాణా బాగా ఇబ్బందిపడ్డాయి. అయితే పై రాష్ట్రాలు బాగా ఇబ్బంది పడినపుడు ఏపీలో కేసుల సంఖ్య తక్కువగానే ఉండేవి. కానీ గత పదిరోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటిపోయింది.
సరిగ్గా ఇలాంటి సమయంలో ఉద్యోగులు సామూహికంగా తమ ఆందోళనలను మొదలుపెట్టారు. నియోజకవర్గ కేంద్రాల నుండి జిల్లా కేంద్రాల దాకా వందలు, వేలాదిమంది ఒకేచోట చేరి నిరసనలు తెలుపుతున్నారు. దీనివల్లే కరోనా కేసులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది సరిపోదన్నట్లుగా ఫిబ్రవరి 3వ తేదీన లక్షలమందితో ఛలో విజయవాడ ప్రోగ్రామ్ పెట్టారు. అలాగే కరోనా వైరస్ ను కంట్రోల్ చేయటంలో సాయం చేయాల్సిన ఉద్యోగులే చివరకు కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.