హమ్మయ్య : వ్యాక్సిన్ ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!

NAGARJUNA NAKKA
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మార్కెట్ విక్రయానికి కేంద్రం అనుమతిచ్చింది. రెండు టీకాలకు షరతులతో కూడిన అనుమతిని డీజీసీఐ మంజూరు చేసింది. అయితే ఈ వ్యాక్సిన్లు మెడికల్ షాపుల్లో లభించవు. వీటిని ఆస్పత్రులు, క్లినిక్ ల్లో మాత్రమే విక్రయించనున్నారు. ఈ టీకాలు 275రూపాయల వరకు లభించనున్నాయి. అయితే దీనికి అదనంగా జీఎస్టీ 150రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా టీకాలు ఇస్తోంది. అయితే ఇప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా రెగ్యులర్ బహిరంగ మార్కెట్ లో అమ్ముకోవడానికి సంస్థలు అనుమతి కోరాయి. త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.  

మరోవైపు కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 జనవరి నాటికి 15ఏళ్లు నిండే వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. 15 నుండి 18 ఏళ్ల మధ్య వయసు వారితో పాటు వీరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్ని  రాష్ట్రాలకు లేఖ రాసింది. 2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన వారు కూడా ఈ 15 నుండి 18ఏళ్ల కేటగిరీలోకే వస్తారని స్పష్టం చేసింది.

ఒమిక్రాన్ కారణంగా పేషెంట్ లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాయని ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో తేలింది. ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతోందని ఐసీఎమ్ఆర్ తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని.. ఒమిక్రాన్ లక్ష్యంగా టీకా వ్యూహాన్ని రూపొందించుకోవాలని పేర్కొంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా గత వారంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగాయి. జనవరి 17నుంచి 23వరకు ఏకంగా 2.1కోట్ల మంది కరోనా బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఒక వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కేసులు ఊహించనంతగా పెరిగాయని తెలిపింది. ఇదే వారంలో ప్రపంచ వ్యాప్తంగా 50వేల మంది కరోనాతో చనిపోయారని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: