కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.. ఇదే నిదర్శనం?

praveen
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఇది పెద్దలు చెప్పే మాట. అయితే ఇదే మాటను ఇటీవల కాలంలో ఎంతోమంది యువకులు నిజం చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎంతోమంది అద్భుతాలను సృష్టిస్తున్నారు నేటి రోజుల్లో. కేవలం పెద్ద పెద్ద చదువులు చదివిన వారే కాదు సాదాసీదా జీవితాన్ని గడుపుతూ చదువుకు దూరంగా ఉన్న వారు సైతం తమ ప్రతిభను నిరూపించుకుంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని సరికొత్త వాహనాలను తయారు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి తన ప్రతిభను చాటుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. సాధారణంగా దూరప్రాంతాలకు పర్యటించాలంటే అన్ని రకాల సౌకర్యాలతో కూడిన వాహనం కావాల్సి ఉంటుంది. ఇలాంటి వాహనం కావాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాలి. కానీ తక్కువ మొత్తంలో ఖర్చు చేసి ఎంతో సౌకర్యవంతమైన వాహనాన్ని రూపొందించాడు ఇక్కడ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఇక తాను తయారు చేసిన వాహనాన్ని సోషల్ మీడియాలో పెట్టి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. కేరళలోని కోజికోడ్ కు చెందిన ఆకాష్ కృష్ణ అనే విద్యార్థి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

 అయితే ఆకాష్ కృష్ణ మొదట పాత సామాన్ల దుకాణం నుంచి తీసుకొచ్చిన సామాగ్రితో సైకిల్ను రూపొందించాడు. ఇక ఈ సైకిల్ కి గేర్ లు, మోటార్ కూడా బిగించాడు. ఇక ఆ తర్వాత ఈ సైకిల్ తోనే ట్రావెలింగ్ చేయాలని అనుకున్నాడు. దీనికోసం క్యాంపర్ క్యాప్సుల్స్ ను కూడా జత చేశాడు ఆకాష్ కృష్ణ. పి వి సి బోర్డులు మెటల్ ఫ్రేమ్ లతో ఇక ఎంతో అద్భుతంగా క్యాంపర్ వాహనాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ క్యాంపర్ లో ఇద్దరు వ్యక్తులు ఎంతో సునాయాసంగా హాయిగా నిద్రపోయేందుకు అవకాశం ఉంటుందట. ఇందులో చిన్న సైజు ఫ్రిడ్జ్, ఇన్వర్టర్, వాటర్ కూలర్, టీవీ, ఫ్యాన్, సెక్యూరిటీ అల్లారం లాంటి సౌకర్యాలు కూడా ఉండటం గమనార్హం. దీని కోసం 65 వేల ఖర్చు చేశాడట. దీని సహాయంతో దేశ వ్యాప్తంగా పర్యటించాలన్నదే  తన లక్ష్యం అంటూ చెబుతున్నాడు ఈ విద్యార్థి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: