జ‌గ‌న‌న్న : జీతం పెరిగిందా? ఎప్పుడు? ఎక్క‌డ‌?

RATNA KISHORE
జీతం పెరిగింద‌న్న ఆనందంలో ఉద్యోగి లేడ‌న్న‌ది వాస్త‌వం.ఎందుకంటే కొత్త పీఆర్సీ ప్ర‌కారం ఉద్యోగికి న‌ష్ట‌మే కానీ లాభం లేద‌న్న‌ది ఓ వాద‌న.కానీ త‌మ నిర్ణ‌యం కార‌ణంగా ఉద్యోగి మూల వేతం యాభై శాతంకు పైగా పెరిగింద‌ని వైసీపీ అంటోంది.వీటి వ‌ల్ల ఔట్ సోర్సింగ్ మ‌రియు కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు మేలు జ‌ర‌గ‌నుంద‌ని కూడా చెబుతోంది.ఇవ‌న్నీ నిజ‌మ‌యితే త‌ప్ప‌కుండా ఆనందించాలి. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇవేవీ సాధ్యం కావ‌ని తేలిపోయింది.ఐఆర్ 27శాతం ఇచ్చి,ఫిట్మెంట్ 23 శాతం ఇవ్వ‌డం ఏంట‌న్న‌ది ఉద్యోగుల ప్ర‌శ్న.త‌మ‌కు పూర్తి న్యాయం జ‌ర‌గ‌నందునే ఉద్యోగ సంఘాలు కూడా సంబంధిత పీఆర్సీ ఒప్పందాల‌పై సంతకాలు చేయ‌లేద‌ని తెలుస్తోంది.కానీ సాక్షి మీడియా మాత్రం త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌న్నీ సానుల‌కూల‌మే అని అంటోంది.
ఇక ఉద్యోగుల‌కు రాయితీల‌పై రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని చెప్ప‌డం కూడా ఈ కోవకు చెందిదే అని విప‌క్షం అంటోంది.ఆ రోజు సీఆర్డీఏ ర‌ద్దు చేసి ఉన్న‌ప‌ళంగా ఏక‌ప‌క్ష నిర్ణ‌యం తీసుకున్న వైసీపీ స‌ర్కారు మ‌ళ్లీ ఇప్పుడు సంబంధిత బిల్లును వెన‌క్కుతీసుకున్నాక విలువ‌యిన స్థలాల‌ను త‌న‌ఖా కింద ఉంచి అప్పులు తీసుకోవ‌డం ఓ వైపు,మ‌రోవైపు కొన్ని స్థ‌లాలు లే ఔట్లుగా మార్చి ఉద్యోగుల‌కు రాయితీల‌పై ఇస్తామ‌ని చెప్ప‌డం ఇవ‌న్నీ కూడా అంత‌గా స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో లేవు అన్న‌ది విప‌క్షం చెబుతున్న మాట లేదా చేస్తున్న ఆరోప‌ణ.
ఆఖ‌రుగా ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ కు సంబంధించి వైసీపీ ఇస్తున్న వివ‌ర‌ణ మ‌రీ విడ్డూరంగా ఉంది.ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌య‌స్సు అర‌వై నుంచి అర‌వై రెండుకు పెంచ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంత‌రాలు వెల్లువెత్తుతున్న త‌రుణాన వాటిని ప‌ట్టించుకోకుండా, తాము ఉద్యోగ ప‌క్ష‌పాతం వ‌హించి, ఏదో మేలు చేశామ‌ని చెప్ప‌డం కూడా స‌మ‌ర్థ‌నీయంగా లేదు అని విప‌క్షం మండిప‌డుతోంది.ఇవేవీ కాద‌ని వైసీపీ త‌న వాద‌న‌ను సొంత ఛానెల్ మ‌రియు మీడియా ద్వారా చెప్పేందుకు చేసే ప్ర‌య‌త్నాల‌న్నీ పెద్ద‌గా స‌ఫ‌లీకృతం అవుతాయా,ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ల‌ను అవి నిలువ‌రిస్తాయా అన్న‌ది ఇప్పుడిక చ‌ర్చ‌కు అందే విష‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: