కుప్పంలో బాబు ఫీట్లు...తెరవెనుక పెద్దిరెడ్డి కాట్లు?

M N Amaleswara rao
రాష్ట్రంలో టీడీపీ పరిస్తితిని చక్కదిద్దాల్సిన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...అసలు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీని సరిదిద్దుకుంటే బెటర్ అన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు కుప్పంలో పెద్దగా అడుగుపెట్టని చంద్రబాబుని..ప్రతిదానికి కుప్పం వచ్చేలా చేశారు చిత్తూరు వైసీపీ నేతలు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...తనదైన శైలిలో వ్యూహాలు వేసి కుప్పంలో టీడీపీకి చెక్ పెట్టి వైసీపీ హవా నడిచేలా చేశారు. అసలు కుప్పంలో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని టీడీపీ శ్రేణులు కలలో కూడా ఊహించి ఉండవు. వరుసపెట్టి పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడింది.

ఇదే ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కూడా ఓటమి తప్పదని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకే ఆయన సడన్‌గా రూట్ మార్చారు..సమయం కుదిరినప్పుడల్లా కుప్పంలో వాలిపోతున్నారు. తాజాగా కూడా ఆయన కుప్పంలో పర్యటించారు. ఏదో ఇప్పుడే ఎన్నికలు ఉన్నట్లు కుప్పంలో ప్రతి గ్రామంలోనూ తిరిగేస్తున్నారు. ప్రజలని కలుస్తున్నారు.

అంటే తాను దూరంగా ఉండటం వల్ల...ప్రజలు కూడా తనకు దూరమయ్యారనే విషయం బాబుకు అర్ధమైంది. అందుకే మళ్ళీ ప్రజలని దగ్గర చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అలాగే పనిచేయని సీనియర్ నేతలకు వార్నింగ్ ఇస్తూ...కార్యకర్తలని కలుపుకునిపోతూ యువతని దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా కుప్పంలో చంద్రబాబుని కాలుకు బలపం కట్టుకుని మరీ తిరిగేలా చేసింది పెద్దిరెడ్డి అని చెప్పొచ్చు. ఆయన కుప్పంలో వైసీపీ బలం పెంచారు.

దశాబ్దాలుగా కుప్పంలో టీడీపీకి అండగా ఉన్న వారిని వైసీపీ వైపుకు తిప్పారు. ప్రభుత్వ పథకాలు, ఇళ్ల స్థలాలు లాంటివి అమలు చేస్తూ ప్రజలని మరింతగా వైసీపీకి సపోర్ట్ ఇచ్చేలా చేసుకుంటున్నారు. ఇక ఆర్ధికంగా కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు సాయం చేసి వారిని కూడా ఇటు తిప్పేసుకున్నారు. అందుకే కుప్పంలో టీడీపీ వీక్ అయింది. ఇక ఆ పరిస్తితులని చక్కదిద్దుకోవాలని బాబు చూస్తుంటే...ఇంకా పెద్దిరెడ్డి తెరవెనుక బాబుకు చెక్ పెట్టేలా ముందుకెళుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: