హ్యాపీ న్యూ ఇయర్ : మొక్కలను ప్రేమిద్దాం.. ఆటలను ఆస్వాదిద్దాం..!

NAGARJUNA NAKKA
డిజిటల్ యుగంగా మారిపోయిన ప్రస్తుత ప్రపంచంలో ఆటలకు చాలా మంది దూరం అవుతున్నారు. సమయం లేక, ఆడే తోడు లేక ఇతర కారణాలతో ఆటలను ఆమడ దూరం పెడుతున్నారు. కానీ ఆ ఆటలు మన శారీరక సామర్థ్యా్నన పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. నూతన సంవత్సరంలో ఆటలను రెజల్యూషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, కబడ్డీ.. ఇలా ఏ ఆటనైనా ఎంచుకొని ఆడటం ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతేకాదు అపార్ట్ మెంట్లలో, ఆఫీసుల్లో లిఫ్టులు వచ్చాక మెట్ల వాడకం బాగా తగ్గిపోయింది. ఒక్క ఫ్లోర్ అయినా సరే లిఫ్టులో వెళ్దాంలే అనేంత బద్దకంగా తయారయ్యారు చాలామంది. అయితే నిత్యం మెట్లు ఎక్కిదిగితేనే జిమ్ కు వెళ్లాల్సిన పనిలేదు. ఇది మంచి వ్యాయామం. దీని వల్ల బరువు తగ్గి మీ శరీరాకృతి మారుతుంది. నడుము, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుంది. ఇక రక్తపోటు, రక్తంలో చెక్కెర స్థాయిలు కూడా బ్యాలెన్స్ అవుతాయి.
అంతేకాదు ఒకప్పుడు మన పెద్దలంతా ప్రకృతితో మమేకమై ప్రకృతి ఒడిలో ఒదిగారు. ఎదిగారు. కానీ ఇప్పటి తరం కాంక్రీట్ జంగిల్ మధ్య పెరుగుతోంది. కాలుష్యం కోరల మధ్య జీవిస్తోంది. కాస్త సమయం తీసుకొని మొక్కలను పెంచడాన్ని న్యూఇయర్ రెజల్యూషన్ గా తీసుకుంటే మనమూ ప్రకృతికి దగ్గర కావొచ్చు. మొక్కలతో మన ఇంటిని అందంగా మార్చుకోవడంతో పాటు.. మనకెంతో ఇస్తున్న ప్రకృతికి మనం కొంత రుణం తీర్చుకున్న వాళ్లవుతాం. మొక్కలు ఇచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్ తో మనము సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవిస్తాం.
ఈ కాలంలో జంక్ ఫుడ్ తినడం అందరికీ సాధారణం అయిపోయంది. కానీ మారిన జీవనశైలితో ఈ ఆహారం తీసుకుంటే శరీరంలో అనవసరంగా క్యాలరీలు పెరుగుతాయి. అంతేకాదు.. జంక్ ఫుడ్ లో వాడే మైదా..ఇతర రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి కొత్త సంవత్సరం నుంచైనా జంక్ ఫుడ్ మానేయాలని రెజల్యూషన్ గా తీసుకోవాలి. మీలో ఆరోగ్యకర మార్పును గమనించడంతో పాటు డబ్బును కూడా ఆదా చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: