తాగినా.. ఊగినా.. అంత వరకే..! ఆ లిమిట్స్ దాటారో..!

NAGARJUNA NAKKA
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. అయితే వేడుకలు జరుపుకోండి కానీ రూల్స్ అతిక్రమించొద్దంటున్నారు పోలీసులు. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు సీపీ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు. సాయంత్రం 6గంటల నుంచి సాగరతీరంలోకి ప్రవేశించేందుకు వీల్లేదని.. యారాడ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. గుంపులుగా చేసుకునే వేడుకలకు అనుమతి లేదన్న సీపీ.. పలు చోట్ల రోడ్లు, ఫ్లైఓవర్లను మూసి వేస్తామన్నారు. రెస్టారెంట్లు కూడా నిర్ణీత సమయం మేరకే ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.

ఇక విజయవాడలో నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు రాత్రి 12గంటల వరకే ఇండోర్ వేడుకలకు అనుమతి ఉందన్నారు. బహిరంగ వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై ఎవరూ తిరగొద్దని ఆదేశించారు. బందరు, ఏలూరు, బీఆర్టీఎస్ రోడ్లు, ఫ్లైఓవర్లు మూసివేస్తామన్నారు. 15చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు.

మరోవైపు నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. 31వ తేదీ రాత్రి 11గంటల నుంచి జనవరి 1ఉదయం 5గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లకు అనుమతి ఉండదన్నారు. లారీలు, గూడ్స్ వాహనాలు, ఫ్లైట్ టికెట్లు ఉన్నవారికే ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్ పోర్ట్ వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ రోజు రాత్రి 10గంటల నుంచి రేపు ఉదయం 5గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేస్తామన్నారు.

ఇక సిటీలో అయతే రాత్రి 11గంటల నుంచి 2గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్ ను మూసివేస్తున్నట్టు తెలిపారు. ఈ రూట్ లో వచ్చే వాహనాలను ఖైరతాబాద్, రాజ్ భవన్ మీదుగా మళ్లిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ మీదుగా లక్డీకపూల్ వైపు మళ్లించనున్నట్టు చెప్పారు.

మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకు సంబందించి ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధించారు. పబ్బులు హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు వేడుకలకు అనుమతించారు. భౌతిక దూరం పాటించాలనే రూల్ పెట్టారు. మద్యం మత్తులో తాగి ఊగేవారు మాస్కులు ధరించే విషయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ఖాకీలు. అంతేకాదు ఇళ్ల మధ్యలో పార్టీలు చేసుకునే వారు స్థానికులను ఇబ్బంది పెట్టొద్దంటున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవంటున్నారు.

 



 





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: