విజయవాడ ప్రశాంతం.. నాయకుల్లోనే టెన్షన్.. టెన్షన్..!
బెజవాడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, రంగా తనయుడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. విజయవాడలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలా మంది.. విజయవాడ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నా రంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నారు.కానీ, వాస్తవాన్ని గమనిస్తే.. ఒకప్పటి విజయవాడకు.. ఇప్పటి విజయవాడకు తేడా ఉంది. గతంలో వర్గ పోరు.. భిన్నద్రువాల రాజకీయాలు.. వ్యూహాలు.. అనేకం కనిపించేవి. పైగా.. తమ వర్గానికి ఏదైనా జరిగితే వెంటనే వాలిపోయే నేతాగణం కూడా కనిపించారు. అందుకే.. మూడు దశాబ్దాల కిందట..రాజకీయాలు వాడివేడిగా సాగాయి.
కానీ, మారిన నేతల పద్ధతితో కార్యకర్తలు దూరమయ్యారు. ముఖ్యంగా హార్డ్ కోర్ నేతలు.. అసలు కనిపించ డం లేదు. రాధా, నెహ్రూల హయంలో వారి కోసం ప్రాణాలు ఇచ్చిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కానీ, ఇప్పుడు నిజం చెప్పాలంటే.. అటు టీడీపీలోను, ఇటు వైసీపీలోను నాయకులకు ఇంత హార్డ్ కోర్ నేతలు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ఎవరి అవసరం వారిది అన్నట్టుగా ఉంటున్నారు. దీంతో నగరంపై నాయకుల ముద్రలు ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయాయి. అంతేకాదు.. ఆయా పార్టీల్లో నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరుతోనే నాయకులకు సమయం చాలడం లేదు. ఇక, బయటకు వచ్చి.. ఒకరిపై ఒకరు.. విమర్శించుకునే పరిస్థితే కనిపించడం లేదు.
ఇలాంటి సమయంలో వంగవీటి రాధాపైరెక్కీ నిర్వహించారంటూ.. వార్తలు రావడం.. సంచలనంగా మారింది. వాస్తవానికి ఆయన కోరుతున్న నియోజకవర్గం సెంట్రల్. ఎందుకంటే.. తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి.. రెండు సార్లు ఓడిపోయారు. పైగా కమ్మ వర్గం ఎక్కువగా ఇక్కడ ఉండడంతో రాధా.. ఇక్కడ నుంచి పోటీకి దూరంగా ఉంటున్నారు. కానీ, తూర్పు కు చెందిన వైసీపీ నేత కనుసన్నల్లో నే.. ఇదంతా జరిగిందని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇది అవాస్తవమేనని తెలుస్తోంది. వట్టి కల్పనలేనని.. కేవలం రాజకీయంగా బూమ్ కోసం చేసిన ప్రయత్నమేనని.. విజయవాడ వాసులే భావిస్తున్నారు.
పైగా.. తన నియోజకవర్గంతో సంబంధం లేని నాయకుడి జోలికి వెళ్లాలని .. వైసీపీ నాయకులు ఎందుకు అనుకుంటారు? పైగా రాధా బలం ఏంటనేది అందరికీ తెలిసిందే. వరుస పరాజయాలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా..పట్టుమని పది మంది కూడా ఉండని పరిస్థితి. పైగా.. కాపు సామాజిక వర్గంలోనే ఆయనను ఓన్ చేసుకునేవారు తగ్గిపోయారు. దీంతో ఆయన ఇప్పుడు రాజకీయంగా ప్రాధన్యం లేకుండానే ఉన్నారు. సో.. ఇలాంటివారిపై ఎవరికి మాత్రం కక్ష ఉంటుంది? అనేది ప్రధాన ప్రశ్న. సో.. విజయవాడ ప్రశాంతంగానేఉందని.. నాయకులే రెచ్చిపోతున్నారని.. అంటున్నారు పరిశీలకులు.