చీరాల వైసీపీ టిక్కెట్ ఆ 10 మందికే.. పాపం బ‌ల‌రాం...!

M N Amaleswara rao
ప్ర‌కాశం జిల్లా చీరాల వైసీపీలో రోజుకో కొత్త కృష్ణుడు రెడీ అవుతున్నాడు. బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని క‌దిలిస్తే ప‌రిస్థితులు ఎలా తేడా కొడ‌తామో ? వైసీపీ అధిష్టానం వేసిన రాంగ్ స్టెప్‌తో ఇక్క‌డ పార్టీ రోజు రోజుకు ఎంత బ‌ల‌హీనంగా మారుతుందో ఇక్క‌డ ప‌రిస్థితి చూస్తే చాలు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ అయితేనే బ‌ల‌మైన క్యాండెట్ అవుతార‌ని వైసీపీ అధిష్టానం భావించింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించ‌డంతో పాటు టిక్కెట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్నా స్థానిక ప‌రిస్థితులు, అప్ప‌టికే ఆమంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచి ఉండ‌డం.. ఇండిపెండెంట్‌గా గెలిచి.. మ‌ధ్య‌లో ఆయ‌న టీడీపీలోకి వెళ్లి .. చివ‌ర్లో వైసీపీలోకి రావ‌డం లాంటి కార‌ణాల‌తో వైసీపీ ఓడింది.



అయితే టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీ చెంత చేరిపోయారు. అప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ క్ర‌మ‌క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌స్తోంది. ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీరాల వైసీపీ టిక్కెట్ నాదే అని చెప్పుకోవ‌డం ప్రారంభించారు. వైసీపీలో టిక్కెట్ ఆశావాహులు రోజుకొక‌రు పుట్టుకు వ‌స్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బ‌ల‌రాం ఆయ‌నే వైసీపీ నుంచి పోటీ చేస్తాడ‌ని అంటుంటే.. కొంద‌రు ఆయ‌న త‌న‌యుడు వెంక‌టేష్ ఈ సారి పోటీ చేస్తాడ‌ని అంటున్నారు.



ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత సీటు నాదే అని చెప్పుకుంటున్నారు. బ‌ల‌రాం ఎవ‌రు ? ఇక్క‌డ త‌మ‌కే ప‌ట్టు ఉంద‌ని.. టిక్కెట్ మాదే అని ఆమె చెప్పుకుంటోన్నారు. ఆమె వెన‌కాల ఒక‌రిద్ద‌రు నాయ‌కులు కూడా లేరు. ఇక మునిసిప‌ల్ చైర్మ‌న్ జంజ‌నం శ్రీనివాస‌రావు కూడా క్యాస్ట్‌ కోటాలో సీటు నాదే అని.. ప్ర‌చారం ప్రారంభించేశారు. ఇక మాజీ మంత్రి పాలేటి రామారావు డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఇటు వైసీపీ టిక్కెట్ నాదే అని చెప్పుకుంటూనే.. అటు టీడీపీ నుంచి కూడా ఆఫ‌ర్ ఉంద‌ని ప్ర‌చారం చేసుకుంటూ పార్టీని న‌ష్ట‌ప‌రుస్తున్నారు.

ఇక మ‌రో నేత వ‌రికూట అమృత‌పాణి ఆయ‌న వైసీపీలోకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఎలా ఆట‌లో అర‌టిపండులా ఉన్నారో ఇప్పుడు అదే పొజిష‌న్ నిల‌బెట్టుకుంటున్నార‌న్న సెటైర్లు పేలుతున్నాయి. వీరంతా సీటు మాదే మాదే అని చెప్పుకుంటుంటే ఇప్పుడు మ‌రో నేత కూడా త‌న‌దే టిక్కెట్ అని ఆయ‌న‌కు ఆయ‌నే పేరు ప్ర‌క‌టించేసుకున్నారు. రాష్ట్ర దేవాంగ కార్పోరేష‌న్ చైర్మ‌న్ బీర‌క సురేంద్ర ఇటీవ‌ల ఓ స‌మావేశంలో తాను కూడా టిక్కెట్ రేసులో ఉన్నాన‌ని చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.


విచిత్రం ఏంటంటే బ‌ల‌రాంతో వ‌చ్చిన పోతుల సునీత‌, పాలేటి రామారావు ఎలా ఏకాకులుగా మిగిలిపోయారో.. ఇప్పుడు బ‌ల‌రాం కూడా త‌న‌తో పాటు పార్టీలోకి వ‌చ్చిన వారు.. ఎప్ప‌టి నుంచో వైసీపీలో ఉన్న వారు దూరం జ‌ర‌గ‌డంతో ఆయ‌న కూడా ఏకాకి అయిపోతున్నారు. అయితే పైకి మాత్రం త‌మ‌కేదో ప‌ట్టున్నట్టు డాంబికాలు పోతున్నారు. అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వాళ్లు చీరాల‌లో ఉంటారా ?  లేదా అద్దంకిలోనా ?  మ‌రోచోటా ? అన్న‌ది తేల‌నే లేదు.

ఇక ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సైలెంట్‌గా ఉన్నారు. త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి నియోజ‌క‌వ‌ర్గ‌లో త‌న వ‌ల్ల అయ్యే ప‌నులు చేస్తూ త‌న కేడ‌ర్‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా త‌న వ‌ర్గం కౌన్సెల‌ర్ల‌ను గెలిపించుకుని త‌న ద‌మ్మేంటో చూపించారు. విచిత్రం ఏంటంటే టీడీపీలో ఇక్క‌డ బ‌ల‌మైన క్యాండెట్ లేడు. ప్ర‌తిప‌క్షం అన్న‌దే ఇక్క‌డ లేదు. అలాంటిది ఇక్క‌డ బ‌లంగా ఉండాల్సిన వైసీపీలో ప‌దిమంది బ‌ల‌హీన నేత‌లు త‌యారై పార్టీని నాశ‌నం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇక్క‌డ స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోతే పార్టీని చేజేతులా నాశ‌నం చేసిన‌ట్టు అయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: