కోస్తా : ఆనందయ్యకే ‘చుక్కలు’ చూపించిన గ్రామస్తులు
కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో చుక్కల మందు వేసిన ఆనందయ్యకే ఇపుడు గ్రామస్తులు చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఒమిక్రాన్ వేరియంట్ చాలా స్పీడుగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. దాంతో చాలామంది జనాలు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం గ్రామానికి పోలోమంటు రావటం మొదలుపెట్టారు. ఎందుకంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో అందరికీ నాటు వైద్యుడు ఆనందయ్య చుక్కల మందు వేసి నయం చేశారనే ప్రచారం తెలిసిందే.
ఆ నేపధ్యంలోనే ఇపుడు మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్ కు కూడా చుక్కల మందు తీసుకుందామని జనాలు గ్రామానికి వస్తున్నారు. ఇదే విషయమై గ్రామస్తులు పెద్ద ఆందోళనకు దిగారు. కారణం ఏమిటయ్యా అంటే అప్పట్లో ఎక్కడెక్కడి జనాలు గ్రామానికి వచ్చిన కారణంగా కృష్ణపట్నంకే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లోని కొందరికి కరోనా వైరస్ సోకిందట. దాంతో వాళ్ళందుకు అప్పట్లో వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సొచ్చిందట.అప్పటి నుండి ఆనందయ్య అంటే జనాలు మండుతున్నారు.
అప్పట్లో ఆనందయ్య ఇచ్చిన చుక్కల మందు పనిచేసిందా లేదా అన్నది మాత్రం ఎవరికీ తెలీదు. కాకపోతే తమకు తగ్గిపోయిందని కొందరు తగ్గలేదని మరికొందరు వార్తల్లోకి ఎక్కారు. దాంతో ఆనందయ్యకు మద్దతుగా ప్రతిపక్షాలు మీడియా బాగా హడావుడి చేయటంతో ఆనందయ్యకు దేశవ్యాప్తంగా బాగా ప్రచారం వచ్చేసింది. దాంతో గ్రామానికి వచ్చే జనాలను కంట్రోల్ చేయటానికి పోలీసులు పెద్ద బెటిలిన్నే ఏర్పాటు చేయాల్సొచ్చింది.
సరే ఏమైందో కానీ చివరకు ఆనందయ్య చుక్కల మందు పక్కకుపోయింది. అలాంటిది ఇపుడు మళ్ళీ ఒమిక్రాన్ పెరిగిపోతుండటంతో అందరు మళ్ళీ ఆనందయ్య దగ్గరకు వస్తున్నారట. దాంతో మళ్ళీ తమకు ఎక్కడ కరోనా అంటుకుంటుందో అన్న భయంతో గ్రామస్తులు ఆందోళన మొదలుపెట్టారు. ఎప్పుడైతే గొడవ మొదలైందో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఏదో సర్దుబాటు చేశారు. మొత్తానికి తాను ఒమిక్రాన్ వేరియంట్ కు వైద్యం చేస్తానని ఎవరికీ చెప్పుకలేదు బాబోయ్ అంటు మొత్తుకుంటున్నారు.