బిగ్ బ్రేక్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ అరెస్ట్ ?
- ఎలా అయిన ఎర్రవెల్లి చేరుతా!
- రచ్చబండ నిర్వహిస్తా..!
- ఆగ్రహంతో ఊగిపోయిన టీపీసీసీ బాస్
తెలంగాణ సర్కారు ముందుగా అనుకున్న విధంగా పక్కా వ్యూహంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ చర్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగిలో వడ్లు కొనుగోలుపై ఇప్పటికే వివాదం రేగుతున్న తరుణాన రేవంత్ చేస్తున్న రాజకీయం తగదని, ఎర్రవెల్లిలో దీనిపై రచ్చబండ కార్యక్రమం చేసి ఏం సాధిస్తారని గులాబీ దండు ప్రశ్నిస్తూ... టీ కాంగ్రెస్ విధానాలను తప్పు పడుతోంది. ఆ వివరాలివి....
టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా, ఎర్రవెల్లిలో నిర్వహించాలనుకున్న రచ్చ బండ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నడుమ తొలుత ఆయనను గృహ నిర్బంధం చేశారు. తరువాత ఆయన ఎలా అయిన ఎర్రవెల్లికి వెళ్లి తీరుతానని, అదేమయినా నిషేధిత ప్రాంతమా అని పేర్కొంటూ కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనను అరెస్టు చేసి సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు. యాసంగిలో వడ్లు కొనుగోలు విషయమై ఎప్పటి నుంచో కాంగ్రెస్ పట్టు పడుతోంది. రైతులకు వరి వేయొద్దని చెప్పి, కేసీఆర్ తన ఫాం హౌస్ లో ఎలా వరి సాగుకు ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నిస్తూ రేవంత్ మండి పడ్డారు.
మరోవైపు టీఆర్ఎస్ మాత్రం రేవంత్ చెబుతున్న మాటలు అర్థవంతంగా లేవని, తాము ఎప్పటి నుంచో కేంద్రం వైఖరిపై పోరాడుతున్నామని, వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యతను కేంద్రం తీసుకోకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమస్యను రాజకీయం చేస్తోందని, గత సారి సేకరించిన ధాన్యం కొనుగోలుపైనే ఇప్పటికీ కేంద్రం నుంచి ఓ స్పష్టత లేదని, ఇప్పుడు యాసంగిలో వడ్లు కొనుగోలు పై ఎటువంటి ప్రకటనా లేని కారణంగానే తాము దేశ రాజధానిలో నిరసనలు చేపట్టామని గుర్తు చేస్తున్నారు. మరోవైపు రేవంత్ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు ప్రభుత్వ చర్యను తప్పు పడుతున్నాయి. వడ్లు కొనుగోలు చేయడమే కాకుండా,రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని పట్టు బడుతోంది. పెట్టుబడి సాగుకు సంబంధించి కూడా ఇప్పటికీ నిధుల విడుదలపై ఓ స్పష్టత లేదని అంటోంది.