మల్లన్న వ్యాఖ్యలపై నేతల మాటల దాడి..!
మంత్రి కేటీఆర్ కుమారుడిపై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న నిర్వహించిన పోల్ పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చిన్నపిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారనీ.. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. అటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి అసత్య ప్రచారమని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయం తెలిపారు. పిల్లలను రాజకీయాల్లోకి గుంజడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదన్నారు. మహిళలను, పిల్లలను కించపరిస్తే.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలన్నారు షర్మిల.
మరోవైపు బీఎస్పీ కన్వీనర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మల్లన్న పోల్ పై స్పందించారు. కనీస మర్యాద, సంస్కారం లేకుండా పోల్ పెట్టారని మండిపడ్డారు. ఏ పార్టీకి చెందిన నేతలైనా.. తమ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలని.. వారి కుటుంబ సభ్యులపై కామెంట్లు సరికాదన్నారు.
మంత్రి కేటీఆర్ కుమారుడిపై తీన్మార్ మల్లన్న నిర్వహించిన పోల్ దుమారం రేపుతుంటే.. దీనిపై స్పందించిన బీజేపీ కార్యదర్శి మనోహర్ రెడ్డి.. మల్లన్న తప్పేమీ చేయలేదన్నారు. అతనిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. భద్రాద్రిలో ఏ హోదాలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు తలంబ్రాలు సమర్పించారని.. అభివృద్ధి పనులను పరిశీలించారని ప్రశ్నించారు. కుటుంబాలను రాజకీయాల్లోకి ఎవరు లాగారని అన్నారు.