థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో చెప్పిన ఐఐటీ కాన్పూర్..!

NAGARJUNA NAKKA
మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ముందుగానే అంచనా వేసిన ఐఐటీ కాన్పూర్.. ఇప్పుడు థర్డ్ వేవ్ విషయంలో అంచనాలను వెల్లడించింది. కరోనా థర్డ్ వేవ్ 2022 ఫిబ్రవరి 23నాటికి గరిష్ట స్థాయికి చేరుతుందని నివేదికలో తెలిపింది. గాస్సియన్ మిక్స్చర్ మోడల్ ఉపయోగించి తయారు చేసిన ఈ అంచనా నివేదిక బృందంలో.. ఐఐటీ కాన్పూర్ లోని గణిత విభాగ నిపుణులు ఉన్నారు. అయితే నిన్న ప్రపంచ వ్యాప్తంగా 9లక్షల కరోనా కేసులు వచ్చాయి.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఒమిక్రాన్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందనీ.. ఒకటిన్నర నుంచి మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని ఆరోగ్య సెక్రటరీ రాజేశ్ భూషణ్ చెప్పారు. దేశంలో వచ్చిన 183ఒమిక్రాన్ కేసులను పరిశీలిస్తే.. అందులో 91శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారేనని తెలిపారు.
ఇక కోవిడ్ వ్యాక్సిన్లు, యాంటీ బాడీ థెరపీలతో లభించే రక్షణ నుంచి ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకోగలదని ఓ అధ్యయనం తాజాగా వెల్లడించింది. మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ రెండు డోసులు తీసుకున్నవారి యాంటీ బాడీలు ఒమిక్రాన్ పై ప్రభావం చూపలేకపోయాయని యూఎస్ఏ కొలంబియా యూనివర్సిటీ పేర్కొంది. ఈ వైరస్ ఎలా అభివృద్ధి చెందుతుంతో అంచనా వేస్తూ కొత్త వ్యాక్సిన్లు రూపొందించాలని సర్వే సూచించింది.
ఇక మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100దాటింది. ఈ రోజు ఒక్కరోజే అక్కడ 20 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 108కి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. దుబాయి నుంచి వచ్చే ప్రయాణీకులకు వారం రోజుల క్వారంటైన్ విధించారు. ఇతర అంతర్జాతీయ ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించకుండా ఆంక్షలు పెట్టారు. వారికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: