ఆహా నాని ఓహో నాని : విశాఖ ఉక్కు సంగ‌తి పీకే చూసుకుంటాడ‌ట‌!

RATNA KISHORE
ఎవ్వ‌రయినా స‌రే
మాట్లాడాల్సినంత
మాట్లాడ‌డం వివేకం
అవును! విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ పై
మాట్లాడ‌డం పోరాడ‌డం పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించ‌డం అన్న‌వి ఇప్ప‌టి త‌క్ష‌ణ అవ‌స‌రాలు.


డిజిట‌ల్  వేదిక‌ల‌పై నిర‌స‌నలు వ్య‌క్తం చేస్తే ప్ర‌భుత్వాలు దిగిరావు.. పార్ల‌మెంట్ లో ప్ల కార్డులు ప‌ట్టుకున్నా ప్ర‌భుత్వాలు దిగిరావు కానీ  ఎవ‌రి ప్ర‌య‌త్నం వారు చేయాల‌న్న క‌నీన విజ్ఞ‌త ఒక‌టి  ఎవ‌రికైనా ఉండాల్సిందే! అవును స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ అన్న‌ది ఆగ‌దు. ఇదే విష‌యాన్ని తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ‌న్ కూడా చెప్పేశారు..ఆర్థిక మంత్రి హోదాలో ! అలా అని అడ‌గ‌కుండా వ్య‌తిరేకించ‌కుండా ఉండాలా? ఇంత‌కూ స్టీల్ ప్లాంటు ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్ర‌య‌త్నాలేంటో ఒక్క‌సారి మంత్రి నాని వివ‌రిస్తే త‌ప్ప‌క తాము తెలుసుకుంటామ‌ని విప‌క్ష నేత‌లు ముక్త‌కంఠంతో అంటున్నారు.


త‌మ స‌భ్యులు చొర‌వ‌తో నిన్న‌టి వేళ జెడ్పీలో  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ఆపాలని తీర్మానం చేశార‌ని, అదేవిధంగా జీహెచ్ ఎంసీ కూడా ఇదే విష‌యమై మ‌ద్ద‌తు ఇస్తూ తీర్మానం చేసింద‌ని, ఇదే విధంగా మ‌రికొన్ని రోజులు స్థానిక ప్ర‌భుత్వాల నుంచి కూడా నిర‌స‌న‌లు వ్య‌క్తం అయితే బాగుంటుంద‌ని సీపీఎం చెబుతోంది. అంతేకానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ నో లేదా మ‌రొక‌రినో టార్గెట్ గా చేసుకుంటే నిర‌స‌న‌ల తీవ్ర‌త అన్న‌ది కేంద్రానికి తెలియ‌కుండా పోతుంద‌ని, అయినా స్థానిక ప్ర‌భుత్వాల తీర్మానాల‌ను సుప్రీం కోర్టు కూడా గౌర‌విస్తుంద‌ని, ఈ పాటి కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఎవ్వ‌రూ ఉండ‌రని, క‌నుక నాని త‌న ప‌రిధిలో లేని విష‌య‌మై మాట్లాడ‌డం క‌న్నా ఊరుకున్నంత ఉత్త‌మం మ‌రొక‌టి ఉండద‌ని అంటున్నారు వామ‌ప‌క్షం స‌భ్యులు. అస‌లు ఓ మంత్రి హోదాలు స్థానిక ప్ర‌భుత్వాల తీర్మానాల‌కు బ‌లం చేకూరుస్తూ కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలి కానీ మాట్లాడే వారిని కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌డం త‌గ‌ద‌ని జ‌న‌సేన స‌భ్యులు మండిప‌డుతున్నారు.



విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని ఇవాళ కాదు ఎన్నాళ్ల నుంచో వినిపిస్తున్న శ‌బ్దం మ‌రియు శ‌బ్ద నాదం.. నినాదం కూడా అదే! కానీ ఇప్పుడు వైసీపీ మంత్రి మాత్రం విభిన్న‌మయిన స్పంద‌న ఒక‌టి అందించి వెళ్లారు. ఆయ‌నే కొడాలి నాని. ఆయ‌న చెబుతున్న ప్ర‌కారం త‌మ‌కు విశాఖ ఉక్కు విష‌య‌మై వ్యూహ‌క‌ర్త ( పార్టీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్)  చెప్పిన మాటే వేదం అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్లాంటు విష‌య‌మై మేమేం చేయాలో అన్న విష‌యం పీకే చూసుకుంటార‌ని, జ‌న‌సేన ఏం చేయాలో పీకే (ప‌వ‌న్ క‌ల్యాణ్‌) చూసుకోవాల‌ని హిత‌వు చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్ర‌యివేటీక‌ర‌ణ చేసే విష‌య‌మై ఇప్ప‌టికే కేంద్రం వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న త‌రుణాన, వాటిని అడ్డుకునేందుకు మంత్రులు కానీ వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు కానీ ప్ర‌య‌త్నించ‌కుండా,  ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం అన్న‌ది ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చేదే. తాము అధికార పార్టీగా ప్లాంటు ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటున్నా మ ని, దేశ వ్యాప్తంగా ఉన్న స్టీలు ప్లాంట్ల‌ను మూసేయాల‌న్ని కేంద్రం భావిస్తే దానిని ఓ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా అడ్డుకుంటుంద‌ని, తాము చెప్పినంత మాత్రాన మూసెయ్య‌డం ఆపేస్తారా అని ఎదురు ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ డిజిట‌ల్ ప్రచారంతో ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ ద‌ని కూడా తేల్చేశారు. కేవ‌లం ప్ల కార్డులు ప‌ట్టుకున్నంత మాత్రాన ప్లాంటు ప్ర‌యివేటీక‌ర‌ణ ఆగిపోతే, త‌మ ఎంపీలంతా త‌మ ష‌ర్టుల వెనుకా ముందు సేవ్ విశాఖ సేవ్ స్టీల్ ప్లాంట్ అని రాయిస్తే కేంద్రం దిగివ‌స్తుందా అని ఎదురు ప్ర‌శ్న వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: